Lemon Coriander Soup : మనలో చాలా మంది సూప్ ను ఇష్టంగా తాగుతూ ఉంటారు. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ సూప్ ను తయారు చేసుకుని తాగుతూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన సూప్ వెరైటీలల్లో లెమన్ కొరియాండర్ సూప్ కూడా ఒకటి. నిమ్మరసం, కొత్తిమీర కలిపి చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు ఇలా లెమన్ తో రుచికరమైన సూప్ ను తయారు చేసుకుని తాగవచ్చు. ఎంతో రుచిగా, వేడి వేడిగా ఉండే ఈ లెమన్ కొరియాండర్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ కొరియాండర్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 400 ఎమ్ ఎల్, ఎరోమాటిక్ పౌడర్ – ఒక టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – ఒక కట్ట, నిమ్మరసం – ఒకటిన్నర చెక్క.
లెమన్ కొరియాండర్ సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఎరోమాటిక్ పౌడర్, తెల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత కార్న్ ఫ్లోర్ లో నీటిని పోసి పలుచగా కలుపుకోవాలి. తరువాత దీనిని మరుగున్న నీటిలో పోసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు మరిగించిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు మరిగించిన తరువాత నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పైన కొద్దిగా కొత్తిమీరను చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లెమన్ కొరియాండర్ సూప్ తయారవుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ఇంట్లోనే వేడి వేడిగా సూప్ ను తయారు చేసుకుని తాగవచ్చు.