Shanmukh : బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఎంతో మందికి చాలా పేరు వచ్చింది. అలాంటి వారిలో షణ్ముఖ్ ఒకరు. షణ్ముఖ్ మొదట్లో యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ , కవర్ సాంగ్స్ చేసేవాడు. తరువాత దీప్తి సునైనతో పరిచయం అయి అది ప్రేమకు దారి తీసింది. ఆ తరువాత బిగ్‌బాస్‌లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. అయితే బిగ్‌బాస్‌లో షణ్ముఖ్ తెలిసి చేసినా.. తెలియక చేసినా.. సిరితో హద్దులు మీరి ప్రవర్తించాడు. దీనికి అతను తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కానీ అది గతం.
ఇక ఇప్పుడు షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు పరోక్షంగా కామెంట్లు పెట్టుకుంటున్నారు. ఇటీవల వాలెంటైన్స్ డేకు ఈ ఇద్దరూ కలుసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. కాగా షణ్ముఖ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టాడు. నటుడు సూర్య అంటే తనకు ఇష్టమని ఆయనను కలిసినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.
సూర్య, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఈటీ (ఎతర్‌కుమ్ తునిందవన్). ఈ సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో భాగంగా షణ్ముఖ్ తన అభిమాన నటుడు సూర్యను కలిశాడు. అందుకనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.
ఈ రోజు నాకు ప్రత్యేకమైన రోజు.. గత కొద్ది నెలలుగా నేను అనేక ఫెయిల్యూర్‌లతో ఆందోళన చెందుతున్నా.. కానీ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది.. నా కల నెరవేరింది.. అంటూ షణ్ముఖ్ పోస్ట్ చేశాడు. దీంతో షణ్ముఖ్ పోస్ట్ వైరల్ అవుతోంది.