Madatha Kaja : దీపావళి పండుగ రానే వస్తుంది. ఈ పండుగకు రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. దీపావళి పండుగ నాడు ప్రత్యేకంగా ఉండేలా అలాగే చాలా త్వరగా అయ్యేలా మనం చిట్టి మడత కాజాలను తయారు చేసుకోవచ్చు. తియ్యటి రుచిని కలిగి ఉండే ఈ చిట్టి మడత కాజాలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చిట్టి కాజాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిట్టి కాజా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, కరిగించిన బటర్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, పంచదార – ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చిట్టి కాజా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, బటర్ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పది నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార, ముప్పావు కప్పు నీళ్లు పోసి పంచదార కరిగే వరకు తిప్పుతూ వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత కొద్దిగా లేత తీగ పాకం వచ్చే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో యాలకుల పొడి, నిమ్మరసం వేసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరో 2 నిమిషాల పాటు బాగా కలపాలి. తరువాత పిండి మొత్తాన్ని తీసుకుని పొడి మైదా పిండి వేసుకుంటూ దీర్ఘచతురస్రాకారంలో చపాతీలా రుద్దుకోవాలి.
తరువాత దీనిని పై నెయ్యిని రాయాలి. ఇప్పుడు ఒక వైపు నుండి పిండిని చల్లుకుంటూ మధ్యలో గాలి, సందులు లేకుండా గుండ్రంగా చుట్టుకోవాలి. తరువాత చాకును తీసుకుని అర ఇంచు మందంతో ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో దానిని తీసుకుంటూ వేలితో కాజా ఆకారంలో వత్తుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక స్టవ్ మీద ముందుగా సిద్దం చేసుకున్న పంచదార మిశ్రమాన్ని ఉంచి చిన్న మంటపై వేడి చేస్తూ ఉండాలి. మరో స్టవ్ మీద నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాజాలను వేసి కాల్చుకోవాలి. వీటిని చిన్న మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత వీటిని నూనె నుండి తీసి పంచదార మిశ్రమంలో వేయాలి.
ఈ కాజాలను పంచదార మిశ్రమంలో ఎక్కువ సేపు ఉంచకూడదు. పది నుండి 15 సెకన్ల పాటు ఉంచి వెంటనే తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో తియ్యగా రుచిగా ఉండే చిట్టి కాజాలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు లేదా పర్వదినాలకు, ప్రత్యేక రోజులకు ఇలా చాలా త్వరగా అయ్యే చిట్టి కాజాలను తయారు చేసుకుని తినవచ్చు.