Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ఆయన పలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే సుమారుగా 1000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్స చేయించారు. తన కుమారుడు గౌతమ్ కు పుట్టినప్పుడు గుండె సమస్య ఉందని.. అయితే తన వద్ద డబ్బులు ఉన్నాయి కాబట్టి తన కొడుకును కాపాడుకున్నానని.. కానీ డబ్బులు లేని వారి పరిస్థితి ఏమిటనే ఆలోచన వచ్చిందన్నారు. అందుకనే అలాంటి పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లను చేయిస్తున్నట్లు తెలిపారు.
ఇక హైదరాబాద్‌లోని ప్రముఖ చిన్న పిల్లల హాస్పిటల్ రెయిన్‌బోతో మహేష్ బాబు కలసి పనిచేయనున్నారు. సదరు హాస్పిటల్ వారు 125 మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు చేయనున్నారు. అందుకు మహేష్ సహకారం అందించనున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయమై సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా మహేష్ బాబుతోపాటు రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు పలు వివరాలను వెల్లడించారు.
అయితే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందని అడిగినట్లు.. ఒక లేడీ రిపోర్టర్ మహేష్‌ను ప్రశ్న అడిగింది. చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం మీరు రెయిన్‌బో హాస్పిటల్‌తో కలిసి పనిచేస్తున్నారా.. అని అడిగింది. అయితే మహేష్ అప్పటికే ఆ వివరాలను మొత్తం వెల్లడించారు. దీంతో ఆ రిపోర్టర్ మళ్లీ అదే విషయాలపై ప్రశ్న అడిగే సరికి మహేష్‌కు కాస్త చిరాకు వచ్చింది. వెంటనే ఆ రిపోర్టర్‌పై పంచ్‌లు వేశారు.
నేను ఇప్పటి వరకు చెప్పింది మొత్తం అదే విషయం గురించి కదా, మీరు మళ్లీ అదే అడిగితే ఎలా.. మీరు బహుశా నేను చెప్పింది విని ఉండరు.. మీ మనస్సు ఎక్కడో ఉండి ఉంటుంది, ఇక్కడే ఉండేలా చూసుకోండి.. అంటూ మహేష్ పంచ్‌లు వేశారు. దీంతో అక్కడి వారందరూ బిగ్గరగా నవ్వేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ నటించిన సర్కారు వారి పాట చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్‌తో కలిసి మహేష్ ఓ సినిమా చేయనున్నారు. అందులో పూజా హెగ్డె హీరోయిన్‌గా ఎంపికైంది.