Mohan Babu : మంచు విష్ణు తన హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీనుపై ఫిర్యాదు చేసి కేసు పెట్టించడం ఏమోగానీ.. వారి పరువు మొత్తం పోయింది. నాగశ్రీను తెరమీదకు వచ్చి అసలు విషయం చెప్పాడు. తనను కులం పేరిట దూషించారని.. మోహన్‌బాబు, విష్ణులు తనను కొడుతూ బూతులు తిట్టారని చెప్పాడు. దీంతో నాయీ బ్రాహ్మణ సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు వెంటనే క్షమాపణలు చెప్పాలని.. నాగశ్రీనుపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తేయాలని డిమాండ్ చేశాయి.
అయితే ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఇప్పటికే నాయీ బ్రాహ్మణ సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున రోజూ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాదం తాజాగా హెచ్ఆర్‌సీ దగ్గరకు చేరింది. సదరు సంఘాలకు చెందిన నాయకులు మంచు విష్ణు, మోహన్‌బాబులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్‌సీ)కి ఫిర్యాదు చేశారు.
కాగా ఈ విషయం హెచ్ఆర్‌సీ వద్దకు చేరడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హెచ్ఆర్సీ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందా.. అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన సందర్భంగా నాయీ బ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. మోహన్ బాబు, విష్ణులపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశామని తెలిపారు. మోహన్ బాబుకు క్షమాపణ చెప్పేందుకు రెండు రోజులు గడువు ఇచ్చామని, అయినప్పటికీ వారు స్పందించలేదని.. అందుకనే హెచ్ఆర్‌సీ మెట్లు తొక్కాల్సి వచ్చిందని అన్నారు.
ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతుందని.. అయినప్పటికీ ఇంకా కొందరికి కుల పిచ్చి పోలేదని అన్నారు. బడుగు, బలహీన, పేద వర్గాలకు చెందిన వారిని కులం పేరిట దూషిస్తూ వారిపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ విధానం మారాలని అన్నారు. నాగశ్రీనుపై తప్పుడు కేసులు బనాయించారని.. దీంతోపాటు కులం పేరిట దూషించారని, మోకాళ్లపై కూర్చోబెట్టి కులం పేరుతో నానా దుర్భాషలాడుతూ వ్యవహరించారని.. కనుకనే మోహన్ బాబు, విష్ణులపై చర్యలు తీసుకోవాలని తాము హెచ్ఆర్‌సీని కోరామని తెలిపారు. అయితే హెచ్ఆర్‌సీ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.