Majjiga Charu : మనం ఆహారంగా తీసుకునే పాల సంబంధమైన ఉత్పత్తులల్లో మజ్జిగ ఒకటి. మజ్జిగను తాగడం వల్ల శరీరంలో ఉండే వేడి అంతా తగ్గుతుంది. మజ్జిగను తాగడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మజ్జిగను తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో మజ్జిగ ఎంతో సహాయపడుతుంది. మజ్జిగతో చాలా మంది మజ్జిగ చారు (మజ్జిగ పులుసు) ను తయారు చేస్తూ ఉంటారు. అన్నంతో కలిపి తింటే మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. మజ్జిగ చారును చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మజ్జిగ చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – పావు కిలో, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప ప్పు – ఒక టీ స్పూన్, పసుపు -పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, అల్లం ముక్కలు – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన పచ్చి మిర్చి – 4, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మజ్జిగ చారు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని తగినన్ని నీళ్లను పోసి మజ్జిగలా చేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత ఒక్కొక్కటిగా తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, దంచిన పచ్చి మిర్చి, అల్లం ముక్కలు బాగా వేగిన తరువాత చివరిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపు పూర్తిగా చల్లారిన తరువాత ముందుగా ఉప్పు కలిపి ఉంచిన మజ్జిగలో వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు తయారవుతుంది. ఇలా చేసుకున్న చారును అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. వేసవి కాలంలో ఇలా మజ్జిగ చారును చేసుకుని తిన్నా లేదా నేరుగా మజ్జిగను తాగినా కూడా శరీరంలో చలువ చేస్తుంది. నేరుగా మజ్జిగను తాగలేని వారు ఇలా పులుసులా చేసుకుని తినడం వల్ల కూడా మజ్జిగతో కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.