Palli Laddu : మనం వంటింట్లో పల్లీలను అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. పల్లీల నుండి తీసిన నూనెను వంటల తయారీలో వాడుతూ ఉంటాం. ఉదయం తయారు చేసే అల్పాహారాలను తినడానికి తయారు చేసే చట్నీలో మనం ఎక్కువగా పల్లీలను ఉపయోగిస్తూ ఉంటాం. పల్లీలను పొడిగా చేసి కూరలను. పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. పల్లీలతో తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పల్లీలతో చేసే తీపి పదార్థాలలో పల్లీ లడ్డు (పల్లీ ముద్ద) కూడా ఒకటి. పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రక్త హీనతతో బాధపడే వారికి ఇవి చక్కటి ఔషధంలా పని చేస్తాయి. వీటిని చాలా సులువుగా మనం తయారు చేసుకోవచ్చు. పల్లి లడ్డూలను తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి – చిటికెడు, నీళ్లు – ఒక టీ గ్లాసు.
పల్లి లడ్డూల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించుకోవాలి. పల్లీలు వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పైన ఉండే పొట్టును తీసేయాలి. ఒక గిన్నెలో బెల్లం తురుమును, నీళ్లను పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత జల్లి గంటతో బెల్లం నీటిని వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం నీటిలో ఉండే మలినాలు తొలగిపోతాయి. ఒక గిన్నెలో ఇలా వడకట్టిన బెల్లం నీటిని పోసి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక ప్లేట్ లో నీటిని తీసుకుని కొద్దిగా బెల్లం మిశ్రమాన్ని వేసి చేత్తో ఉండలా చేయాలి. బెల్లం మిశ్రమం ఉండలా చేయడానికి వస్తే పాకం సిద్దమైనదిగా భావించాలి.
బెల్లం మిశ్రమం ముద్దగా చేయడానికి రాకపోతే మరి కొద్ది సేపు ఉడికించి పాకం వచ్చిన తరువాత యాలకుల పొడి వేసి కలిపి మంటను చిన్నగా చేసి ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఒక ప్లేట్ కు నెయ్యిని రాసి పల్లి, బెల్లం మిశ్రమాన్ని ఆ ప్లేట్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు ఆరబెట్టాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత కావల్సిన పరిమాణంలో లడ్డూలలా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల రుచిగా ఉండే పల్లి లడ్డూలు తయారవుతాయి. వీటిని మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల 10 రోజుల పాటు తాజాగా ఉంటాయి.
ఈ విధంగా తయారు చేసుకున్న పల్లి, బెల్లం మిశ్రమంతో పల్లి పట్టీలను కూడా తయారు చేసుకోవచ్చు. రోజూ ఒకటి లేదా రెండు లడ్డూల చొప్పున తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ లడ్డూలను పిల్లలు, పెద్దలు ఎవరైనా తినవచ్చు. ఈ విధంగా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల పల్లీలు, బెల్లం రెండింటిలో ఉండే పోషకాలను పొందవచ్చు. పల్లి లడ్డూలను తినడం వల్ల మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది. దంతాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్త హీనత సమస్య నుండి బయట పడవచ్చు. నెలసరి సమయంలో వచ్చే వెన్ను నొప్పిని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.