Crispy Corn : రెస్టారెంట్ స్టైల్‌లో క్రిస్పీ కార్న్‌.. ఇలా సుల‌భంగా చేయొచ్చు..

Crispy Corn : స్వీట్ కార్న్.. దాదాపుగా దీనిని మ‌న‌లో చాలా మంది తినే ఉంటారు. స్వీట్ కార్న్ ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఎన్నింటినో పొంద‌వ‌చ్చు. దీనిలో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, పీచు ప‌దార్థాల‌తోపాటు శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర పోష‌కాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. చాలా మంది స్వీట్ కార్న్ ను ఉడికించుకుని, గింజ‌ల‌ను వేయించుకుని తింటూ ఉంటారు. ఇవే కాకుండా వీటితో ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వంట‌కం మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భ్య‌మ‌వుతుంది. అచ్చం రెస్టారెంట్ ల‌లో దొరికే విధంగా రుచిగా క‌ర‌క‌ర‌లాడేలా ఈ క్రిస్పీ కార్న్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ కార్న్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్వీట్ కార్న్ – 2 క‌ప్పులు, నీళ్లు – ఒక లీట‌ర్, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కి స‌రిప‌డా, చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ‌లు – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం – 2 టేబుల్ స్పూన్స్, కారం – అర టీ స్పూన్, చాట్ మ‌సాలా – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – పావు టీ స్పూన్, ట‌మాట కెచ‌ప్ – 2 టేబుల్ స్పూన్స్.

make Crispy Corn in this way like restaurant style
Crispy Corn

క్రిస్పీ కార్న్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత అందులో స్వీట్ కార్న్ గింజ‌ల‌ను, అర టీ స్పూన్ ఉప్పును వేసి 5 నిమిషాల‌ పాటు ఉడికించుకోవాలి. త‌రువాత ఈ గింజ‌ల‌ను జ‌ల్లిగంటెలోకి తీసుకుని నీరు అంతా పోయేలా వ‌డ‌క‌ట్టుకోవాలి. త‌రువాత ఈ గింజ‌ల‌ను చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత వీటిపై మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, కొద్దిగా ఉప్పును వేయాలి. త‌రువాత పిండి అంతా స్వీట్ కార్న్ గింజ‌ల‌కు ప‌ట్టేలా క‌లుపుకోవాలి. అవ‌స‌ర‌మైతే ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల నీళ్ల‌ను వేస్తూ క‌లుపుకోవాలి.

ఇలా క‌లుపుకున్న త‌రువాత లోతుగా ఉండే క‌ళాయిని తీసుకుని అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా క‌లిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజ‌ల‌ను కొద్ది కొద్దిగా వేస్తూ కాల్చుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని టిష్యూ పేప‌ర్ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్య‌క ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగగానే క్యాప్సికం ముక్క‌ల‌ను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.

త‌రువాత ఉప్పు, కారం, చాట్ మ‌సాలా, జీల‌క‌ర్ర‌పొడి, ఆమ్ చూర్ పొడి వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ట‌మాట కెచ‌ప్ వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ గింజ‌ల‌ను కూడా వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా రెస్టారెంట్ లో ల‌భించే విధంగా ఉండే క్రిస్పీ కార్న్ త‌యార‌వుతుంది. ఆమ్ చూర్ పొడి అందుబాటులో లేని వారు స్ట‌వ్ ఆఫ్ చేసిన త‌రువాత గింజ‌ల‌పై నిమ్మ‌ర‌సాన్ని వేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న క్రిస్పీ కార్న్ పై ఉల్లిపాయ ముక్క‌లను, కొత్తిమీర‌ను చ‌ల్లుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా మొత్తం తినేస్తారు.

D

Recent Posts