Garam Masala Powder : మన వంట ఇంటి మసాలా దినుసుల్లో అనేక రకాలకు చెందినవి ఉంటాయి. అయితే అన్నింటినీ కలిపి తయారు చేసేదే.. గరం మసాలా పొడి. దీన్ని మనం రోజూ లేదా తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అలాగే ఇవన్నీ మూలికలుగా పనిచేస్తాయి. కనుక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. వీటితో మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి గరం మసాలా పొడిని మనం వంటల్లో వాడాల్సి ఉంటుంది. అయితే గరం మసాలా పొడిలో ఏయే మసాలా దినుసులను వాడాలి.. ఎంత మొత్తంలో వాడితే పొడి చక్కగా వస్తుంది.. అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే ఏయే దినుసులను ఎంత మొత్తంలో ఉపయోగించి గరం మసాలా పొడిని ఎలా తయారు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గరం మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – 5 (2 ఇంచుల పొడవు ఉండాలి), యాలకులు పొట్టు తీసినవి – ఒక కప్పు, జీలకర్ర – అర కప్పు, మిరియాలు – అర కప్పు, లవంగాలు – అర కప్పు, ధనియాలు – అర కప్పు, తురిమిన ఎండు కొబ్బరి – పావు కప్పు.
గరం మసాలా పొడిని తయారు చేసే విధానం..
పైన తెలిపిన అన్ని పదార్థాలను విడివిడిగా పెనంపై వేయించుకోవాలి. నూనె లేకుండా ఒక్కో దాన్ని వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి పొడిగా పట్టుకోవాలి. దీన్ని మెత్తగా లేదా బరకగా.. ఎవరికి నచ్చినట్లు వారు పట్టుకోవచ్చు. దీంతో గరం మసాలా పొడి తయారవుతుంది. ఇది 15 నుంచి 20 రోజుల వరకు వస్తుంది. ఇలా గరం మసాలా పొడిని సులభంగా తయారు చేసుకోవచ్చు.