Bagara Rice : మ‌సాలా వంట‌కాల్లోకి బ‌గారా అన్నం.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!

Bagara Rice : మ‌నం త‌యారు చేసే నాన్ వెజ్ వంట‌ల‌ను తిన‌డానికి అప్పుడ‌ప్పుడూ బ‌గారా అన్నాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసిన వంట‌ల‌ను బ‌గారా అన్నంతో తిన‌డం వ‌ల్ల వంట‌ల రుచి మ‌రింత పెరుగుతుంది. ఈ బ‌గారా అన్నాన్ని రుచిగా, ప‌లుకుగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

make Bagara Rice in this way for masala curries
Bagara Rice

బ‌గారా అన్నం త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – ఒక గ్లాస్, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్ లేదా త‌గినన్ని, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు ప‌లుకులు – కొద్దిగా, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌.

మ‌సాలా దినుసులు..

ల‌వంగాలు – 4, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క ముక్క‌లు – 4, యాల‌కులు – 4, సాజీరా – ఒక టీ స్పూన్, మ‌రాఠీ మొగ్గలు – 2, అనాస పువ్వు – 1, జాప‌త్రి – 1.

బ‌గారా అన్నం త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో లేదా క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడ‌య్యాక జీడిప‌ప్పు పలుకుల‌ను, మ‌సాలా దినుసులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చి మిర్చిని, ఉల్లిపాయ‌ల‌ను వేసి వేయించాలి. ఉల్లిపాయ‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కొత్తిమీర‌ను, పుదీనాను వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత నీళ్ల‌ను పోసి అందులో త‌గినంత ఉప్పును వేసి క‌లిపి నీళ్ల‌ను మ‌ర‌గ‌నివ్వాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లిపి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 5 నిమిషాల పాటు ఉడికించాలి.

త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌గారా అన్నం త‌యార‌వుతుంది. ఈ బ‌గారా అన్నం త‌యారీలో బాస్మ‌తి బియ్యానికి బ‌దులుగా సాధార‌ణ బియ్యాన్ని కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అలాగే నెయ్యికి బ‌దులుగా నూనెను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసుకున్న బ‌గారా అన్నాన్ని నాన్ వెజ్ వంట‌కాల‌తోపాటు మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts