Kothimeera Pachadi : మనం వంటకాలను తయారు చేసిన తరువాత వాటి మీద చివర్లో కొత్తిమీరను చల్లుతూ ఉంటాం. కొత్తిమీరను మనం తరచూ వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీరను వాడడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు కొత్తిమీరలో ఉంటాయి. కొత్తిమీరతో మనం పచ్చడిని, కొత్తిమీర రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కొత్తిమీర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీరతో మనం నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పచ్చడి ఒక నెలరోజుల వరకు తాజాగా ఉంటుంది. కొత్తిమీరతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర – 2 (మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 8 లేదా తగినన్ని, చింతపండు – 10 గ్రాములు, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2 , కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – చిటికెడు.
కొత్తిమీర నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కొత్తిమీరను కాడలతో సహా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యాక ఆరబెట్టుకున్న కొత్తిమీరను తరిగి నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. కొత్తిమీర వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలను, జీలకర్రను, మెంతులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఎండుమిరపకాయలను వేసి రంగు మారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి.
ఇవి చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని పొడిలా చేసుకోవాలి. ఇందులోనే వేయించిన కొత్తిమీరను, చింతపండును, ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని గాలి తగలకుండా ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల 20 నుండి 30 రోజుల పాటు తాజాగా ఉంటుంది.