Mutton Curry : మనలో చాలా మంది ఇష్టంగా తినే మాంసాహార ఉత్పత్తుల్లో మటన్ కూడా ఒకటి. మటన్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ తోపాటు అన్ని రకాల పోషకాలు కూడా లభిస్తాయి. మనం మటన్ తో అనేక రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చాలా రుచిగా, సులభంగా మలన్ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – అర కిలో, నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చి మిర్చి – 4 లేదా 5, సాజీరా – ఒక టీ స్పూన్, యాలకులు – 2, లవంగాలు – 3, దాల్చిన చెక్క – 2, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, కారం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత, కరివేపాకు – ఒక రెబ్బ, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), తరిగిన టమాట – 1, నీళ్లు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – కొద్దిగా, నీళ్లు – తగినన్ని, ధనియాల పొడి – 2 టీ స్పూన్లు, గరం మసాలా – ఒక టీ స్పూన్.
మటన్ కూర తయారీ విధానం..
ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి అందులో ఒక టీ స్పూన్ ఉప్పును, పసుపును, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను, కారాన్ని వేసి బాగా కలిపి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తరువాత ఒక కుక్కర్ లో నూనె వేసి నూనె కాగిన తరువాత దాల్చిన చెక్క ముక్కలను, లవంగాలను, సాజీరాను, యాలకులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఉల్లిపాయలను రంగు మారే వరకు వేగిన తరువాత తరిగిన టమాటాలను వేసి కలిపి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
తరువాత మటన్ ను వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 3 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి మరలా కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి అందులో ధనియాల పొడిని, గరం మసాలా పొడిని వేసి నీళ్లు పోయి మటన్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా తరిగిన కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలగుతుంది.