Onion Chutney : మన ఆరోగ్యానికి ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఉల్లిపాయలను మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయలు వేయడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వంటల్లో వాడడంతో పాటు ఉల్లిపాయలతో కూర, చట్నీ, పులుసు వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఉల్లిపాయలతో చేసే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో రుచిగా, సులువుగా చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినపప్పు – పావు కప్పు, ఎండుమిర్చి – 6 , పచ్చిమిర్చి – 4, తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 3, చింతపండు – నిమ్మకాయంత, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – రెండు రెమ్మలు.
ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు, మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేయించాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత చింతపండు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ చట్నీ తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.