Paper Dosa : ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకునే దోశల రుచి తెలియని వారు ఉండనే ఉండరు. దోశలను చాలా సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు. దోశలు మనకు బయట హోటల్స్ లో, టిఫిన్ సెంటర్లలో ఎక్కడపడితే అక్కడ దొరుకుతూనే ఉంటాయి. అయితే మనం బయట తినే దోశలు చాలా పలుచగా, కరకరలాడుతూ పేపర్ లా ఉంటాయి. కానీ ఇంట్లో వీటిని తయారు చేస్తున్నప్పటికీ చాలా మందికి పేపర్ లా దోశలను తయారు చేసుకోవడం రాదు. పేపర్ లా ఉండే దోశలను మనం ఇంట్లో కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. పేపర్ దోశల తయారీకి మినప పప్పును, బియ్యాన్ని ఎంత పరిమాణంలో తీసుకోవాలి.. దోశ పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పేపర్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప గుళ్లు – ఒక కప్పు, బియ్యం – 3 కప్పులు, మెంతులు – ఒక టీ స్పూన్, అటుకులు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నూనె – అర కప్పు.
పేపర్ దోశ తయారీ విధానం..
ముందుగా రెండు గిన్నెలను తీసుకుని ఒక గిన్నెలో మినప పప్పు, మెంతులను మరో గిన్నెలో బియ్యాన్ని, అటుకులను వేసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 8 నుండి 10 గంటల పాటు నానబెట్టుకోవాటి. ఇలా నానబెట్టుకున్న తరువాత మరోసారి శుభ్రంగా కడిగి బియ్యాన్ని, మినప పప్పును కలిపి జార్ లో వేసి తగినన్ని నీళ్లను పోస్తూ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా దోశ పిండిని తయారు చేసుకున్న తరువాత తగినంత ఉప్పును వేసి కలిపి మూత పెట్టి 8 గంటల పాటు పిండిని కదిలించకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల దోశ పిండి ఎక్కువగా పులిసి దోశలు రుచిగా ఉంటాయి. 8 గంటల తరువాత మూత తీసి మరోసారి పిండిని కలపాలి. ఇప్పుడు చిన్న మంటపై పెనాన్ని వేడి చేసి పిండిని తీసుకుని పులుచగా దోశలా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనెను వేసి చిన్న మంటపై దోశ క్రిస్పీ, ఎర్రగా అయ్యే వరకు కాల్చి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా , కరకరలాడుతూ ఉండే పేపర్ దోశలు తయారవుతాయి. ఈ దోశలను పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాట చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.