Vavilaku : మన శరీరంలో వచ్చే వాతపు రోగాలను నయం చేసే ఆకు అంటే ఎవరికీ తెలియదు.. కానీ వావిలి ఆకు అంటే మాత్రం చాలా మందికి తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే బాలింత ఆకు అనగానే అందరికీ తెలుస్తుంది. వావిలి చెట్టు ఆకులు ఒక రకమైన వాసనను కలిగి ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో వావిలి మొక్క కూడా ఒకటి. వావిలి చెట్టును ఉపయోగించి ఒంటి నొప్పులతోపాటు అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పూర్వ కాలంలో నీటిలో వావిలి ఆకులను వేసి బాగా వేడి చేసి ఆ నీటితో బాలింతలకు స్నానం చేయించేవారు. ఇలా చేయడం వల్ల బాలింతలకు ఒంటి నొప్పులు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
తీవ్రంగా జలుబు చేసినప్పుడు నీటిలో వావిలి ఆకులను, యూకలిప్టస్ ఆకులను వేసి మరిగించి ఆ నీటితో ఆవిరి పట్టుకోవడం వల్ల జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. వావిలి చెట్టులో ప్రతి భాగం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. శరీరంలో వచ్చే వాతపు నొప్పులను, వాపులను తగ్గించడంలో వావిలి చెట్టు ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. జలుబు, తలనొప్పి, కాలేయం, గుండె సంబంధమైన సమస్యలను తగ్గించే శక్తి వావిలి చెట్టు పువ్వులకు ఉంటుంది. కీళ్ల నొప్పులను, కీళ్ల వాపులను, కండరాల నొప్పులను తగ్గించడంలో కూడా ఈ చెట్టు ఆకులు సహాయపడతాయి.
వావిలి చెట్టు ఆకులను తీసుకుని వేడి చేసి నొప్పులు, వాపులు ఉన్న చోట కట్టుగా కట్టడం వల్ల నొప్పులు, వాపులు త్వరగా తగ్గుతాయి. వావిలి ఆకులతో తైలాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కండరాలు పట్టినట్టు ఉండడం, కండరాల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. అర కిలో వావిలి ఆకుల రసానికి అర కిలో నువ్వుల నూనెను కలిపి మరిగించడం వల్ల నీరు అంతా పోయి నూనె మిగులుతుంది. ఈ నూనెను గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను నొప్పులు, వాపులపై రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి.
మనకు ఎక్కువగా నీలి వావిలి చెట్టు, తెల్ల వావిలి చెట్టు ఆకులు లభిస్తూ ఉంటాయి. ఇవి రెండు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. తెల్ల వావిలి చెట్టుకు వేడి చేసే గుణం ఉంటుంది. పక్షవాతం, కటివాతం మొదలైన వాత రోగాలతోపాటు దగ్గు, ఆయాసం వంటి కఫ రోగాలను నయం చేసే గుణం వావిలి చెట్టుకు ఉంటుంది. ఉదరంలోని క్రిములను చంపే శక్తి కూడా వావిలి ఆకులకు ఉంటుంది. ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ నొప్పుల నుండి బయట పడడానికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ ను వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల దుష్పభ్రావాలు అధికంగా ఉంటాయి.
పెయిన్ కిల్లర్స్ ను వాడడానికి బదులుగా.. వావిలి చెట్టు లేత ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక కప్పు నీటిలో వేసి మరిగించి ఆ నీటిలో ఒక టీ స్పూన్ తేనెను కలిపి 40 రోజుల పాటు తాగడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, సయాటిక నొప్పులు తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గినప్పటికీ శరీరంలో వేడి చేయడం, కళ్లు మండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి తప్ప మరి ఏ ఇతర దుష్పభ్రావాలు ఉండవు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఈ నీటిని తాగడం ఆపాలి. వావిలి చెట్టు ఆకులను నీటిలో వేసి మరిగించి ఈ నీటితో స్నానం చేయడం వల్ల అన్ని రకాల వాతపు నొప్పులు, వాపులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.