Ravva Laddu : మనం ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఉండే తీపి పదార్థాల్లో రవ్వ లడ్డూలు కూడా ఒకటి. రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఈ రవ్వ లడ్డూలను పంచదారతోపాటు బెల్లాన్ని ఉపయోగించి కూడా తయారు చేస్తుంటారు. కానీ కొందరు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ లడ్డూలు గట్టిగా తయారవుతుంటాయి. వీటిని మృదువుగా, మెత్తగా ఉండేలా తయారు చేసుకోలేకపోతుంటారు. బెల్లంతో రవ్వ లడ్డూలను మెత్తగా, మృదువుగా ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నీళ్లు – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, యాలకుల పొడి – పావు టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – 2 టేబుల్ స్పూన్స్.
రవ్వ లడ్డూల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో బొంబాయి రవ్వను వేసి చిన్న మంటపై 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత అందులోనే ఎండుకొబ్బరి పొడిని వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించి రవ్వను కూడా మరో ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో బెల్లం తురుమును, నీళ్లను పోసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టి మరలా అదే కళాయిలోకి తీసుకోవాలి.
బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. తరువాత అందులో యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత బెల్లం మిశ్రమం కొద్దిగా చల్లగా అయిన తరువాత అందులో ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వను, డ్రై ఫ్రూట్స్ ను వేసి గంటెతో కలుపుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత చేత్తో అంతా కలిసేలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఇందులో చివరగా పాలను పోసి కలిపి కావల్సిన పరిమాణంలో రవ్వను తీసుకుంటూ లడ్డూలలాగా చుట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డూలు తయారవుతాయి. ఇలా చేసిన లడ్డూలు వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా రుచిగా, త్వరగా అయ్యే రవ్వ లడ్డూలను చేసుకుని తినవచ్చు. వీటి తయారీలో మనం పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగిస్తున్నాం. కనుక వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.