Water : మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నీళ్లు కూడా అంతే అవసరం. తగినన్ని నీళ్లను తాగడం వల్ల మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. వైద్యులు మనకు రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు నీళ్లను తాగాలని సూచిస్తుంటారు. నీళ్లను తాగితేనే శరీరంలోని జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడతాయి. అలాగే శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు పోతాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొందరు నీళ్లను సరిగ్గా తాగరు. దీంతో అనేక సమస్యల బారిన పడతారు. అయితే నిపుణులు చెబుతున్న ప్రకారం.. రోజులో ఈ సమయాల్లో మాత్రం కచ్చితంగా నీళ్లను తాగాల్సిందే. అది ఎప్పుడనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా సరే కచ్చితంగా నీళ్లను తాగాలి. గోరు వెచ్చని నీళ్లను తాగితే ఇంకా మంచిది. దీంతో జీర్ణవ్యవస్థలో ఉండే వ్యర్థాలు అన్నీ త్వరగా బయటకు పోతాయి. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలు ఉండవు. సుమారుగా అర లీటర్ నుంచి లీటర్ మేర నీళ్లను ఉదయం నిద్ర లేవగానే తాగితే ఎంతో మేలు జరుగుతుంది. అయితే గోరు వెచ్చని నీళ్లు అందుబాటులో లేని వారు సాధారణ నీళ్లను అయినా సరే తాగవచ్చు. కానీ ఉదయం నిద్ర లేవగానే నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో శరీరం పునరుత్తేజం చెందుతుంది.
ఉదయం వ్యాయామం చేసిన తరువాత కూడా నీళ్లను తాగాలి. ఎందుకంటే చెమట రూపంలో ద్రవాలు బాగా బయటకు పోతాయి. అలాగే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కనుక వీటిని నియంత్రించాలంటే నీళ్లను తాగాలి. వ్యాయామం చేసిన తరువాత 5 నిమిషాలు ఆగి అప్పుడు నీళ్లను తాగాల్సి ఉంటుంది.
భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు లేదా భోజనం చేసిన అనంతరం 30 నిమిషాల తరువాత నీళ్లను తాగాలి. భోజనం మధ్యలో నీళ్లను తాగరాదు. తాగితే జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కొవ్వుగా మారుతుంది. ఇది శరీరంలో పేరుకుపోతుంది. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. కనుక భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగరాదు.
స్నానం చేయడానికి ముందు ఒక గ్లాస్ నీళ్లను తాగడం వల్ల బీపీ తగ్గుతుంది. స్నానం వల్ల శరీర ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. దీంతో ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించేందుకు గాను తాత్కాలికంగా రక్త సరఫరా పెరుగుతుంది. దీని వల్ల బీపీ కూడా ఎక్కువవుతుంది. అయితే బీపీ పేషెంట్లకు ఇది మంచిది కాదు. కనుక వారు స్నానానికి ముందు ఒక గ్లాస్ నీళ్లను తాగాలి. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
ఇక రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ నీళ్లను తాగాలి. దీని వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. రక్త సరఫరాకు ఆటంకాలు ఏర్పడవు. ఫలితంగా రాత్రి పూట గుండె పోటు రాకుండా నివారించవచ్చు. అలాగే శరీరంలో కాస్త నలతగా, అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నీళ్లను బాగా తాగాలి. దీంతో ద్రవాలను కోల్పోకుండా ఉంటాము. నీరసం ఉండదు. యాక్టివ్‌గా ఉంటారు. దీంతోపాటు అలసటగా, బలహీనంగా ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్లి వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా నీళ్లను తాగాలి. రోజులో ఇతర ఏ సమయాల్లోనైనా నీళ్లను తాగకపోయినా.. పైన తెలిపిన సమయాల్లో మాత్రం తప్పకుండా నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటాము. అనారోగ్యాల బారిన పడకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.