Rumali Roti : మనకు బయట రెస్టారెంట్లలో లభించే వాటిల్లో రుమాలీ రోటీలు కూడా ఒకటి. ఇవి చాలా పలుచగా చూడగానే తినాలనిపించేలా ఉంటాయి. రుమాలీ రోటీలను నిమ్మకాయ, ఉల్లిపాయ, షేర్వాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. బయట లభించే విధంగా ఉండే రుమాలీ రోటీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మెత్తగా, పలుచగా ఉండే రుమాలీ రోటీలను మనం చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో రుమాలీ రోటీలను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రుమాలీ రోటీల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒకటిన్నర కప్పు, గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పంచదార – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – అర కప్పు, నీళ్లు – తగినన్ని.
రుమాలీ రోటీల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి. తరువాత గోధుమ పిండిని, ఉప్పును, పంచదారను, నూనె వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత తగినన్ని నీళ్లను పోసి చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండి చేతికి అంటుకుపోకుండా అందులో రెండు టీ స్పూన్ల నూనెను వేసి అంతా కలిసేలా మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెపై మూతను ఉంచి అరగంట పాటు పిండిని నాననివ్వాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లను తీసుకుని అందులో కొద్దిగా ఉప్పును వేసి ఉప్పు కరిగేలా కలుపుకోవాలి. తరువాత నానబెట్టుకున్న పిండిని తీసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కావల్సిన పరిమాణంలో తీసుకుని ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుంటూ పొడి మైదా పిండి చల్లుకుంటూ వీలైనంత పలుచగా వత్తుకోవాలి. రుమాలీ రోటీలు మరింత పలుచగా ఉంటాయి. కనుక ఇలా వత్తుకున్న తరువాత చేతులతో మరింత పలుచగా చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద అడుగు భాగం గుండ్రంగా ఉండే ఒక ఇనుప కళాయిని ఉంచి వేడి చేయాలి. కళాయి వేడయ్యాక అడుగు భాగం పైకి వచ్చేలా కళాయిని స్టవ్ మీద బోర్లించి మంటను మధ్యస్థంగా ఉంచాలి. ఇప్పుడు కళాయి మీద ముందుగా ఉప్పు వేసి కలిపిన నీటిని చల్లాలి. ఇలా చేయడం వల్ల కళాయికి రోటీ అతక్కుపోకుండా ఉంటుంది. ఇలా ఉప్పు నీటిని చల్లిన తరువాత ముందుగా తయారు చేసిన రోటీని కళాయిపై వేసి కాల్చుకోవాలి. ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకుని దానిని తడిపి నీళ్లు లేకుండా పూర్తిగా పిండాలి. దీనితో రోటీ మీద వత్తుతూ రోటీని రెండు వైపులా కాల్చుకుని హాట్ బాక్స్ లోకి తీసుకోవాలి లేదా గిన్నెలోకి తీసుకుని గిన్నెపై మూతను ఉంచాలి.
ఈ విధంగా చేయడం వల్ల మనకు బయట లభించే విధంగా ఉండే రుమాలీ రోటీ తయారవుతుంది. ఈ రుమాలీ రోటీని చిన్న మంటపై ఎక్కువ సేపు కాల్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల రోటీ గట్టిగా తయారవుతుంది. వీటిని పెద్ద మంటపై త్వరత్వరగా కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రుమాలీ రోటీలను మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.