Makhana Payasam : మఖన.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. తెల్లగా గోళీకాయలంత సైజులో నల్లని మచ్చలను కలిగి ఉంటాయి. వాటినే మఖన అంటారు. కొందరు ఫూల్ మఖన అని కూడా వీటిని పిలుస్తారు. వీటిని ఉత్తరాది వారు ఎక్కువగా వండుకుంటారు. అయితే ఇవి మనకు ఎంతో ఆరోగ్యకరమైనవి. వీటితో ఎన్నో వంటలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మఖనలతో తయారు చేసే పాయసం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో.. అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మఖన పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
మఖన – రెండు కప్పులు, సగ్గు బియ్యం – పావు కప్పు, చిక్కటి పాలు – ఒకటిన్నర కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్స్, యాలకుల పొడి – కొద్దిగా, చక్కెర – అర కప్పు, ఉప్పు – చిటికెడు, నీళ్లు – ఒక లీటర్, జీడి పప్పు – 2 టీ స్పూన్స్, ఎండు ద్రాక్ష – 2 టీ స్పూన్స్.
మఖన పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక కలాయిలో మఖన ని వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన మఖనలో పావు భాగాన్ని తీసుకుని ఒక జార్‌లో వేసి మెత్తని పొడిలా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలా చూసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన మఖన ని నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నెయ్యి వేసి కాగాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక కళాయిలో నీళ్లు పోసి కాగాక సగ్గు బియ్యం వేసి ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం ఉడికిన తరువాత పాలు, చక్కెర, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి 15 నిమిషాల పాటు పాలు కాగే వరకు ఉంచాలి. ఇప్పుడు పలుకుగా చేసుకున్న మఖన ని వేయాలి. 5 నిమిషాల తరువాత నానబెట్టిన మఖన ని వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మఖన పాయసం తయారవుతుంది.
మఖన వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇది షుగర్ ను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఇందులో చక్కెరకు బదులుగా బెల్లం వేసి పాయసం తయారుచేసి తాగాలి. దీంతో అధిక బరువు తగ్గుతారు. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి శక్తి, పోషకాలు లభిస్తాయి. ఈ సీజన్‌లో దీన్ని రోజూ ఒక గ్లాస్ మోతాదులో తాగడం వల్ల శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. వేసవి తాపం, ఎండ దెబ్బ నుంచి బయట పడవచ్చు.