Saggubiyyam Upma : వేసవిలో సహజంగానే మన శరీరం వేడిగా మారుతుంది. కనుక శరీరాన్ని చల్లబరుచుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అత్యుత్తమంగా ఉపయోగపడే ఆహారాల్లో.. సగ్గుబియ్యం ఒకటి. దీంతో జావ కాచుకుని తాగితే శరీరానికి చలువ కలుగుతుంది. అయితే సగ్గు బియ్యంతో ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు. దాంతోనూ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. దీన్ని ఎలా తయారు చేయాలి.. కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గు బియ్యం – మూడు కప్పులు, ఉప్పు – కొద్దిగా, నూనె – ఒక టీ స్పూన్, నీళ్లు – సరిపడా.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, ఎండు మిర్చి – 6, జీలకర్ర – 2 టీ స్పూన్స్, తరిగిన ఉల్లి పాయ ముక్కలు – అర కప్పు, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు – 2 టీ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, నూనె – 2 టీ స్పూన్స్, ఉప్పు – రుచికి తగినంత, తరిగిన కొత్తి మీర – కొద్దిగా.
సగ్గు బియ్యం ఉప్మా తయారు చేసే విధానం..
ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడగాలి. ఈ సగ్గు బియ్యంలో మరీ ఎక్కువగా కాకుండా నానబెట్టిన తరువాత కూడా సగ్గు బియ్యం పొడిగా ఉండేలా తగినన్ని నీళ్లను, కొద్దిగా ఉప్పును, ఒక టీ స్పూన్ నూనెను వేసి బాగా కలిపి 6- 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో పల్లీలు, 5 ఎండు మిరప కాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించిన తరువాత జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక మిగిలిన తాళింపు పదార్థాలు అన్నీ వేసి వేయించుకోవాలి. ఈ తాళింపు వేగాక ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని , తగినంత ఉప్పును వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు సగ్గు బియ్యం రంగు మారే వరకు ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం పూర్తిగా రంగు మారిన తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసి బాగా కలిపి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత తరిగిన కొత్తి మీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గు బియ్యం ఉప్మా తయారవుతుంది. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వేసవిలో మనం తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాల్లో సగ్గుబియ్యం ఒకటి. కనుక ఈ సీజన్‌లో దీన్ని ఇలా తీసుకున్నా.. మనకు మేలే జరుగుతుంది.