ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వలన ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.పెద్ద చదువులు చదివి, బాగా అభివృద్ధిలోకి వస్తాడనుకున్న కొడుకు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిస అయ్యి లక్షల రూపాయలు అప్పు చేయడం, అన్నీ అమ్మిన కూడా అప్పు తీర్చలేని పరిస్థితిలో ఓ కుటుంబంకి ఆత్మహత్యే శరణ్యమనుకుంది. తల్లిదండ్రులు, సోదరి ప్రాణాలు కోల్పోగా, ఆ యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకోగా, ఇది ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది.
వివరాలోకి వెళితే బీటెక్ చదువు కోసం వెళ్లి గత కొద్ది కాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డ 23 ఏళ్ల దినేష్. భారీగా అప్పులు చేశాడు.. రూ. కోటి మేర అప్పులు అయ్యాయి.. రూ. కోటి మేర ఆన్ లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకొని తల్లిదండ్రులను కష్టాల్లో పడేశాడు.. అప్పుల భారం ఎక్కువ అవ్వడంతో కోటి రూపాయలకు ఆస్తిని అమ్మిన తండ్రి నాగరాజు రెడ్డి.. దినేష్ చేసిన అప్పులను తీర్చాడు. అయినా దినేష్ లో మాత్రం మార్పు రాలేదు. అంత జరిగినా ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనాన్ని వీడకుండా మరో రూ. 30 లక్షలు ఆన్ లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం అప్పులు చేస్తున్న దినేష్‌తో కుటుంబ సభ్యులు గొడవకు దిగారు.. దీంతో దినేష్ కొత్త స్కెచ్ వేశాడు. అందరూ చనిపోదామని ఒప్పించాడు.
దినేష్ తోపాటు తల్లి జయంతి, తండ్రి నాగరాజ రెడ్డి, అక్క సునీతలతోపాటు అందరూ చనిపోదామని అనుకున్నారు..అనుకున్నట్లుగానే దినేష్ బయటకు వెళ్లి కూల్ డ్రింక్ ను, పురుగుల మందును తీసుకొచ్చి ఆ రెండు మిక్స్ చేశాడు. పురుగులు మందు కలిపిన కూల్ డ్రింక్ ను కన్న తల్లిదండ్రులకు, తోడబుట్టిన అక్కకు బలవంతంగా తాపించి తాను కూడా తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దినేష్ తల్లిదండ్రులు నాగరాజ రెడ్డి, జయంతి చనిపోయారు.. తాజాగా దినేష్ సోదరి సునీత కూడా మృతి చెందింది. వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దినేష్ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఒకే కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తచేస్తున్నారు.