Masala Jowar Roti : నేటి తరుణంలో చిరు ధాన్యాల వినియోగం ఎక్కువైందనే చెప్పవచ్చు. దీంతో మనలో చాలా మంది చిరుధాన్యాలతో చేసిన వంటకాలను తీసుకుంటున్నారు. చాలా మంది జొన్నలతో చేసే రొట్టెను ఎక్కువగా తీసుకుంటున్నారు. జొన్న రొట్టెను తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే జొన్న రొట్టెను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మసాలాలు వేసి చేసే ఈ మసాలా జొన్న రొట్టె మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. జొన్న రొట్టెను మరింత రుచిగా మసాలాలు వేసి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా జొన్న రొట్టెల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – 3 కప్పులు, పచ్చి పల్లీలు – కప్పు, ఉప్పు- తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, కొత్తిమీర – ఒక చిన్న కట్ట, కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – కొద్దిగా.
మసాలా జొన్న రొట్టెల తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత నువ్వులు, కరివేపాకు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే పల్లీలను కూడా పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి నీటిని మరిగించాలి. తరువాత మరో గిన్నెలో జొన్న పిండిని తీసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి మిశ్రమంతో పాటు పల్లీల పొడి, తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. తరువాత తగినన్ని వేడి నీళ్లు పిండిని గట్టిగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా పిండిని తీసుకుని మందంగా ఉండే చపాతీలా చేసుకోవాలి.
దీనిని పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేస్తూ చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా జొన్న రొట్టె తయారవుతుంది. దీనిని నేరుగా అలాగే తినవచ్చు లేదా కూరతో కూడా తినవచ్చు. ఈ జొన్న రొట్టెలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.