Black Eyed Beans Curry : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందల్లో ఎన్నో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలసందలను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అలసందలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా చేసుకోవచ్చు. ఈ కూరను తయారు చేయడం చాలా సులభం. అలసందలతో రుచిగా, కమ్మగా, సులభంగా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అలసందల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
అలసందలు – ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి తురుము – అర కప్పు, నానబెట్టిన బియ్యం – ఒక టీ స్పూన్, ధనియాలు -ఒకటిన్నర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 5, చింతపండు గుజ్జు – ఒక టీ స్పూన్, బెల్లం – ఒక చిన్న ముక్క, ఉప్పు – తగినంత.
అలసందల కూర తయారీ విధానం..
ముందుగా అలసందలను 3 గంటల పాటు నీటిలో వేసి నానబెట్టుకోవాలి. తరువాత వీటిని కుక్కర్ లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేసాకు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు వేసి కలపాలి.
ఇప్పుడు మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మసాలా పేస్ట్, ఉడికించిన అలసందలు వేసి కలపాలి. ఈ కూరను దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అలసందల కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తినడం వల్ల రుచితో శరీరానికి కావల్సిన పోషకాలను కూడా పొందవచ్చు.