Meal Maker Kurma : మీల్ మేక‌ర్‌ల‌తో ఎంతో రుచిగా ఉండే కుర్మాను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Meal Maker Kurma : ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మీల్ మేక‌ర్ లు కూడా ఒక‌టి. సోయా బీన్స్ తో చేసే ఈ మీల్ మేక‌ర్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను వండుతూ ఉంటాం. వీటితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ కుర్మా కూడా ఒక‌టి. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ కుర్మాను తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. నాన్ వెజ్ వంట‌కాల‌కు ఏ మాత్రం తీసి పోకుండా ఉండే ఈ మీల్ మేక‌ర్ కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేక‌ర్ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీల్ మేక‌ర్ – ఒక క‌ప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, ట‌మాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్, చిలికిన పెరుగు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌సూరి మెంతి- ఒక టీ స్పూన్, నిమ్మ‌కాయ – 1.

Meal Maker Kurma recipe in telugu make in this way
Meal Maker Kurma

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

యాల‌కులు – 4, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క‌- ఒక ఇంచు ముక్క‌, మిరియాలు – అర టీ స్పూన్, వెల్లుల్లి – 6, అల్లం – ఒక ఇంచు ముక్క‌, బిర్యానీ ఆకు – చిన్న‌ది ఒక‌టి, ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2.

మీల్ మేక‌ర్ కుర్మా తయారీ విధానం..

ముందుగా వేడి నీటిలో మీల్ మేక‌ర్ ను వేసి 15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని చేత్తో పిండి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఒక జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె కొద్దిగా ప‌సుపు వేసి వేడి చేయాలి. ఇందులో మీల్ మేక‌ర్ వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి కల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, గ‌రం మ‌సాలా, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి.

త‌రువాత నీళ్లు పోసి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత వేయించిన మీల్ మేక‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మ‌రో క‌ప్పు నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి 8 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి పెరుగు వేసి క‌లపాలి. దీనిని చిన్న మంట‌పై నూనె తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత క‌సూరి మెంతి, కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ కుర్మా త‌యార‌వుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీల్ మేక‌ర్ ల‌తో చేసిన కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts