Minapa Vadiyalu : మనం ఇంట్లో రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాం. పప్పు, సాంబార్ వంటి వాటితో పాటు కూరలతో కూడా ఈ వడియాలను తింటూ ఉంటాం. మనం తయారు చేసే వివిధ రకాల వడియాల్లో మినప వడియాలు కూడా ఒకటి. మినప వడియాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ మినప వడియాలను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా ఉండడంతో పాటు సంవత్సరం పాటు నిల్వ ఉండేలా మినపవడియాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మినప వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప గుళ్లు – పావు కిలో, పచ్చిమిర్చి – 8, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మినప వడియాల తయారీ విధానం..
ముందుగా మినపప్పును గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత జార్ లో పచ్చిమిర్చిని వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే మినపగుళ్లను, ఉప్పును కూడా వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత చేతికి నీటి తడిని చేసుకుంటూ ఒక ప్లాస్టిక్ కవర్ పై చిన్న చిన్నగా ముద్దలుగా వడియాలను పెట్టుకోవాలి. వీటిని రెండు రోజుల పాటు బాగా ఎండబెట్టిన తరువాత మరో వైపుకు తిప్పి మరో రోజుల పాటు ఎండబెట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల మినప వడియాలు తయారవుతాయి. ఈ తయారు చేసుకున్న వడియాలను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల సంవత్సరానికి పైగా నిల్వ ఉంటాయి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడియాలను వేసి మధ్యస్థ మంటపై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినప వడియాలు తయారవుతాయి. వీటిని పప్పు, సాంబార్, రసం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని స్నాక్స్ గా కూడా తినవచ్చు. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు.