Millets : మారిన మన ఆహారపు అలవాట్లు మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత సమస్యలు, థైరాయిడ్ ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి వైద్యులు చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. దీంతో చిరు ధాన్యాల వాడకం ప్రస్తుత కాలంలో ఎక్కువైందనే చెప్పవచ్చు. మనం అనేక రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిరు ధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం వంటి సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, మలినాలు, వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి.
శరీరం శుభ్రపడుతుంది.చిరు ధాన్యాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటాము. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభించడంతో పాటు మనం చాలా సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. అయితే చాలా మందికి ఈ చిరు ధాన్యాలను ఎలా వండుకోవాలి.. ఎన్ని గంటల పాటు నానబెట్టుకోవాలి..ఎలా తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది..అన్న విషయాల గురించి తెలియదు. ఈ చిరు ధాన్యాలను సరిగ్గా నానబెట్టకపోతే వాటిలోని పోషకాలు మన శరీరానికి సరిగ్గా అందవు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
చిన్న పరిమాణంలో ఉండే చిరు ధాన్యాలను కనీసం 2 గంటల నుండి 6 గంటల వరకు నానబెట్టాలి. అలాగే పెద్ద పరిమాణంలో ఉండే చిరు ధాన్యాలను 3 గంటల నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. చిరు ధాన్యాలను బాగా ఉడికించి ఉప్మా, కిచిడీ, దోశ, పులావ్, ఇడ్లీ, పులిహోర వంటి వాటిని తయారు చేసుకుని తినవచ్చు. అయితే పెద్ద వయస్కులు వీటిని ఎక్కువగా జావ రూపంలో తీసుకోవాలి. తోటకూర, మునగాకు వంటి ఆకుకూరలను వేసి సులభంగా తినగలిగేలా అలాగే సులభంగా జీర్ణమయ్యేలా వండుకుని తినాలి. అలాగే చిరు ధాన్యాలను వండుకునేటప్పుడు ఎక్కువగా జీలకర్ర, వాము, మిరియాల వంటి దినుసులను ఉపయోగించాలి. వీటిని ఉపయోగించి చిరు ధాన్యాలను వండుకుని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిరు ధాన్యాలను వండుకుని తినడం వల్ల వాటి వల్ల కలిగే ప్రయోజనాలను పొందడంతో పాటు వాటిలోని పోషకాలు కూడా మన శరీరానికి చక్కగా అందుతాయి.