Mokkajonna Garelu : మొక్క జొన్నలు మనకు దాదాపుగా ఏడాదిలో అన్ని నెలల్లోనూ లభిస్తాయి. ఒక్క వేసవి తప్ప మొక్క జొన్నలు మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. స్వీట్ కార్న్ అయితే ఎల్లప్పుడూ లభిస్తుంది. అయితే మొక్కజొన్నలను తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పలు వంటకాలను కూడా చేస్తుంటారు. వీటిని ఉపయోగించి చేసే గారెలు భలే రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కజొన్న గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత మొక్కజొన్న గింజలు – 2 కప్పులు, డీప్ ఫ్రై కి సరిపడా నూనె, రెండు ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, నాలుగు పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర.
మొక్కజొన్న గారెలను తయారు చేసే విధానం..
లేత మొక్కజొన్న గింజల్ని రెండు గంటలు నానబెట్టాలి. తరువాత నానిన మొక్క జొన్న గింజల్ని, అల్లం, పచ్చిమిర్చి వేసి రుబ్బుకోవాలి. ఆ మిశ్రమానికి సరిపడా ఉప్పు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఫ్రై కి సరిపడా నూనె పోయాలి. నూనె కాగాక పిండిని గారెలుగా వత్తుకుని నూనెలో వేయాలి. వీటిని బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. అంతే వేడివేడి మొక్కజొన్న గారెలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏ చట్నీలో అయినా అద్దుకుని తినవచ్చు. భలే రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.