Bathing : శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఎవరైనా స్నానం చేయాల్సిందే. స్నానం వల్ల శరీరం శుభ్రం అవడమే కాదు, మనస్సుకు కూడా ఆహ్లాదం లభిస్తుంది. ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అయితే కొందరు రోజుకు ఒకసారి స్నానం చేస్తారు, కొందరు రెండు సార్లు చేస్తారు, ఇంకా కొందరైతే రోజుల తరబడి స్నానం చేయరు. దీని గురించి పక్కన పెడితే అసలు స్నానం ఎప్పుడు చేసినా ఏం కాదు, కానీ భోజనం చేసిన తరువాత మాత్రం చేయకూడదు. అవును, అది కరెక్టే. మన పెద్దలే కాదు, సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని చెబుతున్నారు. అయితే అసలింతకీ భోజనం చేశాక స్నానం ఎందుకు చేయకూడదు..? చేస్తే ఏమవుతుంది..? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేశాక మన శరీరంలో రక్తం ఎక్కువగా జీర్ణాశయానికి సరఫరా అవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కూడా శక్తి అవసరం. కనుక ఆ శక్తిని అందించేందుకు జీర్ణాశయానికి ఎక్కువగా రక్తం సరఫరా అవుతుంది. అయితే తిన్న వెంటనే స్నానం చేస్తే అప్పుడు మన శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దీన్ని మెదడు వెంటనే గుర్తించి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించే పనిలో పడుతుంది. అప్పుడు రక్తం మన జీర్ణాశయానికి కాక చర్మం వైపు సరఫరా అవుతుంది. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.
ఒక వేళ మనం తిన్నాక చన్నీళ్ల స్నానం చేస్తే అప్పుడు రక్త నాళాలు వెడల్పు అవుతాయి. దీంతో పెద్ద ఎత్తున రక్త సరఫరా జరుగుతుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. అదే వేన్నీళ్ల స్నానం చేస్తే అప్పుడు చర్మంలో ఉన్న రక్త నాళాలు పెద్దవిగా అయి అవి ఎక్కువ ఉష్ణాన్ని చర్మం ద్వారా బయటికి పంపుతాయి. దీంతో శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఈ ప్రక్రియ ముగిసేంత వరకు జీర్ణాశయానికి రక్తం సరిగ్గా అందదు. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే అలా సమస్యలు రాకుండా ఉండడం కోసమే తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెబుతారు.
మరి భోజనం చేశాక ఎంత సేపటి వరకు స్నానం చేయవచ్చు..? అంటే అందుకు కనీసం 45 నుంచి 60 నిమిషాలు ఆగడం మంచిది. అప్పటికి ఆహారం దాదాపుగా జీర్ణమైపోయి ఉంటుంది. కనుక తిన్నాక గంట తరువాత నిరభ్యంతరంగా స్నానం చేయవచ్చు. ఎలాంటి సమస్యా ఉండదు.