Multi Dal Adai Dosa : మనం ఉదయం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో దోశ ఒకటి. దోశను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. మనం ఈ దోశలను కూడా వివిధ రుచుల్లో, వివిధ రకాలుగా తయారు చేస్తూ ఉంటాం. వీటిల్లో అడై దోశ ఒకటి. అడై దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దీనిని తినడం వల్ల వివిధ రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. కేవలం మినపప్పునే కాకుండా ఇతర పప్పులను కూడా మనం ఈ అడై దోశ తయారీలో ఉపయోగిస్తాము. ఆరోగ్యానికి మేలు చేసే ఈ అడై దోశను రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అడై దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, శనగపప్పు – అర కప్పు, మినపప్పు- అర కప్పు, కందిపప్పు – పావు కప్పు, పెసరపప్పు – పావు కప్పు, ఎండుమిర్చి – 5, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – కొద్దిగా , జీలకర్ర – ఒక టీ స్పూన్, క్యారెట్ తురుము – అర కప్పు.
అడై దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, పెరపప్పు, ఎండుమిర్చి వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ అడై దోశ పిండి ఊతప్పం పిండిలా గట్టిగా ఉండేలా చేసుకోవాలి. తరువాత ఈ పిండిలో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేయాలి. తరువాత తగినంత పిండి తీసుకుని పెనం మీద వేయాలి. ఇప్పుడు చేత్తో అర ఇంచు మందం ఉండేలా దోశ ఆకారంలో వత్తుకోవాలి. తరువాత దీనిపై నూనెను వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై అర నిమిషం పాటు వేయించాలి.
తరువాత దోశను మరో వైపుకు తిప్పి కొద్దిగా నూనె వేసి మరలా మూత పెట్టి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా అదే విధంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అడై దోశ తయారవుతుంది. దీనిని కొబ్బరి చట్నీ, టమాట చట్నీ లేదా ఏదైనా కారం చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో సాధారణ బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ ను కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఈ అడై దోశ పిండిని పులియబెట్ట కూడదు. పిండి ఎక్కువగా ఉంటే మిక్సీ పట్టిన వెంటనే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. డైటింగ్ చేసే వారు కూడా ఈ దోశను ఆహారంగా తీసుకోవచ్చు. ఈ దోశను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.