Munakkaya Pappu : మనం సాంబార్ వంటి వాటిని తయారు చేసినప్పుడు అందులో రకరకాల కూరగాయల ముక్కలను వేస్తూ ఉంటాం. సాంబార్ లో వేసే కూరగాయల ముక్కల్లో మునక్కాయ ముక్కలు కూడా ఉంటాయి. మునక్కాయలను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. మునక్కాయలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కేవలం సాంబార్ లోనే కాకుండా మునక్కాయలతో కూర, పచ్చడి వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మునక్కాయలతో ఎంతో రుచిగా ఉండే పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. మునక్కాయలతో పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాడల పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, తరిగిన మునక్కాయలు – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), తరిగిన టమాటాలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – అర గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మునక్కాడల పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత తరిగిన పచ్చి మిర్చి, ఎండు మిర్చి, కరివేపాకును వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయలను, వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలను, ఉప్పును, కారాన్ని, పసుపును వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
తరువాత మునక్కాయ ముక్కలను వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన పప్పును వేసి తగినన్ని నీళ్లనుపోసి కలిపి మూత పెట్టి మునక్కాయల ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాడల పప్పు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.