Mushroom Biryani : మన పుట్టగొడుగులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పుట్టగొడుగులతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పుట్టగొడుగులతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మష్రూమ్ బిర్యానీ కూడా ఒకటి. పుట్టగొడుగులతో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఎవరైనా దీనిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పుట్టగొడుగుల బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్ట గొడుగులు – 200 గ్రా., నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, లవంగాలు – 4, యాలకులు – 3, నల్ల యాలక్కాయ – 1, మరాఠీ మొగ్గ – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సాజీరా – ఒక టీ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, బిర్యానీ మసాలా – ఒక టీ స్పూన్, టమాట – 1, పెరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక గ్లాస్.
మష్రూమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, సోంపు గింజలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టమాటను పేస్ట్ గా చేసి వేసుకోవాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత పుట్ట గొడుగు ముక్కలు వేసి కలపాలి.
వీటిపై మూత పెట్టి ఉడికించాలి. పుట్ట గొడుగుల్లో ఉండే నీరంతా పోయి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. అన్నం ఉడికి నీరంతా పోయిన తరువాత మూత పెట్టి మంటను చిన్నగా చేసి ఉడికించాలి. ఆవిరి పోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆతరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ బిర్యానీ తయారవుతుంది. పుట్టగొడుగులతో తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా రుచిగా బిర్యానీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.