Cherottelu : చేరొట్టెలు.. పాతకాలపు వంటకమైన ఈ చేరొట్టెలను ఎక్కువగా వేసవికాలంలో తయారు చేసుకుని తింటూ ఉంటారు. బియ్యంపిండి, గోధుమపిండి కలిపి చేసేఈ చేరొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మామిడిపండు గుజ్జు, కొత్త ఆవకాయతో కలిపి తింటూ ఉంటారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ చేరొట్టెలను తయారు చేయడం చాలా సులభం. వెరైటీ రుచులను కోరుకునే వారు ఈత చేరొట్టెలను తప్పకుండా రుచి చూడాల్సిందే. ఎంతో రుచిగా ఉండే చేరొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చేరొట్టెల తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వాము – అర టీస్పూన్, కారం – అర టీ స్పూన్, బియ్యంపిండి – ఒక కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, నూనె – ఒక టీ స్పూన్.
చేరొట్టెల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, కారం, వాము వేసి నీటిని మరిగించాలి. నీరు మరిగిన తరువాత బియ్యంపిండి వేసి కలుపుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. ఇందులో ఉప్పు, నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు చల్లారిన బియ్యంపిండిని మరోసారి అంతా కలిసేలా కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత గోధుమపిండిని కూడా ఉండలుగా చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ముందుగా గోధుమపిండి ఉండను తీసుకుని ముందుగా చెక్క అప్పలాగా వత్తుకోవాలి. తరువాత ఇందులో బియ్యంపిండి ఉండను ఉంచి అంచులను మూసేసి ఉండలాగా చేసుకోవాలి.ఇప్పుడు దీనిని పొడి పిండి చల్లుకుంటూ చేత్తో చపాతీలాగా వత్తుకోవాలి. చేత్తో వత్తుకోవడం రాని వారు చపాతీ కర్రతో నెమ్మదిగా వత్తుకోవాలి. ఇలా చేరొట్టెను చేసుకున్న తరువాత దీనిని వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. ముందుగా రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకున్న తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా ఉండే చేరొట్టెలు తయారవుతాయి. వీటిని ఆవకాయ, బాగా పండిన మామిడిపండు గుజ్జుతో తింటే చాలా రుచిగా ఉంటాయి.