Mutton Dalcha : మటన్ దాల్చా.. దీనిని ముస్లింలు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. రంజాన్ మాసంలో దీనిని మరింత ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. మటన్ దాల్చా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, చపాతీ వంటి వాటిలోకి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూసారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ మటన్ దాల్చాను ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా మటన్ దాల్చాను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ దాల్చాను సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ దాల్చా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 5, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచుముక్క, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన లేత మటన్ – 300 గ్రా., ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – 750 ఎమ్ఎల్, గంట పాటు నానబెట్టిన కందిపప్పు – అర కప్పు, నానబెట్టిన శనగపప్పు అర కప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, లేత సొరకాయ ముక్కలు -ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 6, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – 50 ఎమ్ ఎల్.
మటన్ దాల్చా తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత మటన్ వేసి పెద్ద మంటపై 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసికలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి అందులో కందిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తరువాత 100 ఎమ్ ఎల్ నీళ్లు పోసి మరలా కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి విస్కర్ తో పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
తరువాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత సొరకాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత చింతపండు నుండి 100 ఎమ్ ఎల్ చింతపండు రసం తీసి పోసుకోవాలి. దీనిని 4 నిమిషాల పాటు పెద్ద మంటపై మరిగించిన తరువాత ఉడికించిన పప్పు వేసి కలపాలి. తరువాత 100 ఎమ్ ఎల్ నీళ్లు పోసి మరలా మధ్యస్థ మంటపై 12 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ దాల్చా తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.