Mutton Vepudu : మనలో చాలా మంది మటన్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో మటన్ తప్పకుండా ఉండాల్సిందే. మటన్ తో వంటకాలు రుచిగా ఉండడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. మటన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మటన్ వేపుడు కూడా ఒకటి. మటన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. మటన్ వేపుడును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. మటన్ ముక్కలు మెత్తగా ఉండడంతో పాటు చక్కగా వేగేలా ఈ మటన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 5 టేబుల్ స్పూన్స్, పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్.
మటన్ ఉడికించడానికి కావల్సిన పదార్థాలు..
మటన్ – అరకిలో, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, లవంగాలు – 3, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క, కరివేపాకు – ఒక రెమ్మ.
మటన్ వేపుడు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో శుభ్రం చేసుకున్న మటన్ ను వేసుకోవాలి. తరువాత మటన్ ఉడికించడానికి కావల్సిన మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత మటన్ మునిగే వరకు నీటిని పోసి మూత పెట్టి ఉడికించాలి. ఈ మటన్ ను 6 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ ముదురుగా ఉంటే మరో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉడికించిన మటన్ ను నీటితో సహా వేసుకోవాలి.
తరువాత పెద్ద మంటపై నీరంతా పోయే వరకు ఉడికించాలి. మటన్ లోని నీరంతా పోయి నూనె పైకి తేలిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి 5 నుండి 7 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ వేపుడు తయారవుతుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా మటన్ వేపుడును తయారు చేసుకుని తినవచ్చు. దీనిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.