Natu Kodi Kura : నాటుకోడి కూర‌.. అద్భుత‌మైన రుచి రావాలంటే ఇలా చేయండి..!

Natu Kodi Kura : మ‌న‌కు చౌక‌గా ల‌భించే మాంసాహార ఉత్పత్తుల‌లో చికెన్ ఒక‌టి. చికెన్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అయితే ప్ర‌స్తుత కాలంలో నాటు కోడికి పెరిగిన గిరాకీ అంతా ఇంతా కాదు. నాటుకోడి మాంసంతో త‌యారు చేసిన కూర చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే అద్భుత‌మైన రుచి వ‌చ్చేలా.. నాటు కోడితో కూరను ఎలా వండాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Natu Kodi Kura will be very tasty if you cook like this
Natu Kodi Kura

నాటు కోడి కూర త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

నాటు కోడి మాంసం – ముప్పావు కిలో, నూనె – నాలుగు టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన కొత్తిమీర‌- కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, త‌ర‌గిన ట‌మాట – 1 (పెద్ద‌ది), ప‌సుపు – ఒక టీ స్పూన్, ఉప్పు – రుచికి స‌రిప‌డా, కారం – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 2 గ్లాసులు.

మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క ముక్క‌లు – 2 (చిన్న‌వి), ల‌వంగాలు – 8, యాల‌కులు – 2, మిరియాలు – 10, ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బ‌లు – 4.

నాటు కోడి కూర త‌యారీ విధానం..

ముందుగా నాటు కోడి మాంసాన్ని నీటితో శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఒక అర టీ స్పూన్ ప‌సుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి క‌లిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చికెన్ నుండి వ‌చ్చే నీచు వాస‌న రాకుండా ఉంటుంది. త‌రువాత ఒక క‌ళాయిలో మ‌సాలా తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి వేయించి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఇవి చ‌ల్ల‌గా అయిన త‌రువాత ఒక జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల పాటు ప‌సుపు క‌లిపి ఉంచిన చికెన్ ను మ‌రోసారి నీటితో క‌డిగి ప‌క్క‌న‌ పెట్టుకోవాలి.

ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, త‌రిగిన ప‌చ్చి మిర్చి, త‌రిగిన‌ ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత క‌రివేపాకు, కొద్దిగా త‌రిగిన కొత్తిమీర వేసి వేయించుకోవాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌లిపి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత క‌డిగి ఉంచిన చికెన్, త‌రిగిన ట‌మాట ముక్కల‌ను వేసి క‌లిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత ప‌సుపు, రుచికి స‌రిప‌డా ఉప్పు, కారం వేసి క‌లిపి మూత పెట్టి మ‌రో 5 నిమిషాల ఉడికించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి ఇంకో 15 నిమిషాల పాటు ఉడికించాలి. 15 నిమిషాల త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా మిశ్ర‌మాన్ని వేసి క‌లిపి చికెన్ పూర్తిగా ఉడికే వ‌ర‌కు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన త‌రువాత తరిగిన కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉవండే నాటు కోడి కూర త‌యార‌వ‌తుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీ, రోటీ, పూరీ, వ‌డ, రాగి సంగ‌టి వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

D

Recent Posts