Calcium : మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన మినరల్స్‌లో కాల్షియం ఒకటి. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాల్షియం ఉన్న ఆహారాలను తీసుకుంటేనే మనకు కాల్షియం బాగా లభిస్తుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక పెద్దల్లో సుమారుగా 1200 నుంచి 1400 గ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది 99 శాతం వరకు వారి ఎముకలు, దంతాల్లోనే ఉంటుంది. మిగిలిన 1 శాతం శరీరంలోని ఇతర భాగాల్లో ఉంటుంది. కనుక ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఎముకలకు ఎంతగా కాల్షియం కావాలో. కనుక కాల్షియం ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి.
కాల్షియం కేవలం ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. పలు ఇతర పనులకు కూడా అవసరం అవుతుంది. దీని వల్ల గుండెకు మేలు జరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం నియంత్రించబడుతుంది. కండరాల పనితీరుకు అవసరం అవుతుంది. మెదడు ఆలోచించేందుకు, శరీర పెరుగుదలకు కూడా కాల్షియం అవసరం అవుతుంది.
పెద్దలకు రోజుకు సుమారుగా 800 మిల్లీగ్రాముల మేర కాల్షియం కావాలి. అదే యువత, గర్భిణీలు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు రోజుకు 1200 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. అయితే కాల్షియం సులభంగా లభించాలంటే అవి ఉన్న ఆహారాలను రోజూ తినాలి. ముఖ్యంగా మనకు కాల్షియం నువ్వుల్లో అధికంగా లభిస్తుంది. వీటిని గుప్పెడు మోతాదులో రోజూ పెనంపై కాస్త వేయించి తినాలి. లేదా నువ్వులు, బెల్లంతో తయారు చేసే నువ్వుల లడ్డూను రోజుకు ఒకటి తిన్నా చాలు.. మనకు కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది.
ఇక కాల్షియం మనకు ఇతర ఆహారాల్లోనూ అధికంగా లభిస్తుంది. అంజీర్ పండ్లు, రాజ్మా, ఆవాలు, పాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, నారింజలు, రొయ్యలు, గుడ్లు, పెరుగు వంటి ఆహారాలను తరచూ తీసుకుంటుంటే కాల్షియం బాగా లభిస్తుంది. దీంతో కాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు. ఇక మనం తినే ఆహారాల్లో ఉండే కాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకోవాలంటే అందుకు విటమిన్ డి అవసరం అవుతుంది. కనుక కేవలం కాల్షియం మాత్రమే కాదు.. విటమిన్ డి కూడా సరిగ్గా లభించేలా చూసుకోవాలి. ఇందుకు గాను ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య సుమారుగా 20 నిమిషాల పాటు శరీరానికి ఎండ తగిలేలా ఉండాలి. దీంతో మన శరీరం విటమిన్ డిని దానంతట అదే తయారు చేసుకుంటుంది. ఇది కాల్షియం శోషణకు అవసరం అవుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొవ్వును కరిగిస్తుంది. కనుక కాల్షియం పొందాలంటే విటమిన్ డి కూడా లభించేలా చూసుకోవాలి.
విటమిన్ డి మనకు రోజుకు 10 నుంచి 20 మైక్రోగ్రాములు లేదా 400 నుంచి 800 ఐయూ మేర అవసరం అవుతుంది. ఇది సూర్య రశ్మితోపాటు పుట్టగొడుగులు, నారింజ పండ్లు, మాంసం, గుడ్లు, పాలు వంటి ఆహారాల ద్వారా లభిస్తుంది. కనుక విటమిన్ డి, కాల్షియం రెండూ సమపాళ్లలో అందినప్పుడే మన శరీరంలో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కనుక ఇవి రెండూ అందేలా చూసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి.