Natu Kodi Pulusu : నాటుకోడి పులుసు.. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. నాటుకోడి పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దేనితోనైనా తినడానికి ఈ పులుసు చాలా చక్కగా ఉంటుంది. నాటుకోడి పులుసును తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ పులుసును ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే నాటుకోడి పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. రుచిగా, తేలికగా నాటుకోడి పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నాటుకోడి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నాటుకోడి మాంసం – కిలో, నూనె – 5 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 4, యాలకులు – 3, ఉల్లిపాయ ముక్కలు – రెండు కప్పులు, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన టమాటాలు – 2, ధనియాలు – 4 టీ స్పూన్స్, మిరియాలు – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి తురుము – అర కప్పు, గసగసాలు – 3 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – అర కప్పు.
నాటుకోడి పులుసు తయారీ విధానం..
ముందుగా కోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ధనియాలు, మిరియాలు, గసగసాలు, ఎండుకొబ్బరి, సగం దాల్చిన చెక్క, సగం లవంగాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. దీనిని మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత టమాట ముక్కలు, మిక్సీ పట్టుకున్న పొడి, కారం వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత పులుసుకు తగినన్ని నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 20 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నాటుకోడి పులుసు తయారవుతుంది. దీనిని బగారా అన్నం, చపాతీ, రోటి ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.