Nimmakaya Pappucharu : మనం తరచూ వంటింట్లో పప్ప చారును తయారు చేస్తూ ఉంటాం. పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పప్పు చారుతో భోజనం చేయడానికి ఇష్టపడతారు. సాధారణంగా పప్పుచారును మనం చింతపండుతో తయారు చేస్తూ ఉంటాం. చంతపండు రసంతోనే కాకుండా మనం నిమ్మరసంతో కూడా పప్పుచారును తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం వేసి చేసే పప్పు చారు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా ఈ పప్పుచారును తేలికగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తినేలా నిమ్మరసంతో పప్పుచారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ పప్పు చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కందిపప్పు – 100 గ్రా., తరిగిన మునక్కాయ – 1, పొడుగ్గా తరిగిన టమాటాలు – 2, చిన్న ఉల్లిపాయలు – 5, నిమ్మకాయలు – 4, తరిగిన పచ్చిమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్.
నిమ్మకాయ పప్పు చారు తయారీ విధానం..
ముందుగా ఉడికించిన కందిపప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులోనే టమాట ముక్కలు, మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అర లీటర్ నీళ్లు పోసి బాగా కలపాలి. తరువాత ఈ పప్పుచారును ముక్కలు మెత్తగా అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపుతో పాటు మరో అర లీటర్ నీళ్లు పోసి కలపాలి. ఈ పప్పు చారును మరో 10 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న చారులో వేసి కలపాలి. తరువాత నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ పప్పు చారు తయారవుతుంది. దీనిని అన్నం, ఇడ్లీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చింతపండు కంటేఈ విధంగా నిమ్మరసం వేసి చేసిన పప్పు చారు మరింత రుచిగా ఉంటుంది. తరచూ చింతపండుతోనే కాకుండా అప్పుడప్పుడూ ఇలా నిమ్మరసంతో కూడా పప్పు చారును తయారు చేసుకోవచ్చు.