Lentils : పప్పు దినుసులు అంటే అందరికీ తెలిసిన విషయమే. వీటిలో ఎన్నో రకాలు ఉంటాయి. శనగలు, కందులు, పెసలు, ఎర్ర పప్పు, మినప పప్పు.. ఇలా అనేక రకాల పప్పు దినుసులు ఉన్నాయి. ఇవి మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. మన శరీరానికి కావల్సిన రోజువారీ ప్రోటీన్లలో మనకు పప్పు దినుసులు సుమారుగా 25 శాతం ప్రోటీన్లను అందిస్తాయి. అలాగే వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. చాలా మంది నాన్ వెజ్‌ను తినేందుకు ఇష్టపడరు. అయితే ప్రోటీన్ల కోసం నాన్ వెజ్ ఆహారాలనే తినాల్సిన పనిలేదు. రోజూ పప్పు దినుసులను ఏ రూపంలో తిన్నా చాలు.. మనకు ప్రోటీన్లు అందుతాయి. అందువల్ల పప్పు దినుసులను మాంసానికి ప్రత్యామ్నాయ ఆహారంగా చెప్పవచ్చు.
పప్పు దినుసులలో ప్రోటీన్లతోపాటు ఫైబర్, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిల్లో పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల పప్పు దినుసులను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా తరచూ వీటిని తింటుంటే గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు రావు. అలాగే ఒక కప్పు పప్పు దినుసుల్లో 18 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. సాధారణంగా ఇన్ని గ్రాముల ప్రోటీన్లు కావాలంటే మనం మాంసాన్ని అధికంగా తినాల్సి ఉంటుంది. కానీ పప్పు దినుసులను కొన్ని తిన్నా చాలు.. ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లను పొందవచ్చు. ఇక ఒక కప్పు పప్పు దినుసుల ద్వారా మనం 6.5 మిల్లీగ్రాముల ఐరన్‌ను కూడా పొందవచ్చు. దీని వల్ల ఐరన్ లోపం అనేది రాదు. రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
ఒక కప్పు పప్పు దినుసుల్లో సుమారుగా 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పప్పు దినుసుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక త్వరగా ఆకలి వేయదు. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా నియంత్రణలో ఉంటుంది. ఇది అధిక బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే పప్పు దినుసుల్లో ఐరన్, జింక్, మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పప్పు దినుసులను తినడం వల్ల షుగర్ ఉన్నవారికి కూడా మేలు జరుగుతుంది. వీటిల్లో ఉండే ఫైబర్ గ్లూకోజ్ ను నెమ్మదిగా రక్తంలో కలిసేలా చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరగవు. షుగర్ నియంత్రణలో ఉంటుంది.
పప్పు దినుసుల్లో సాల్యుబుల్, ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ రెండూ ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్‌తో కలుస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ సులభంగా బయటకు వెళ్లిపోతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రావు. అలాగే పప్పు దినుసుల్లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. ఇలా పప్పు దినుసులతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఇవి త్వరగా జీర్ణం కావు. అందువల్ల వీటిని నేరుగా ఉడికించి తినరాదు. కనీసం 2 గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ తరువాత ఉడికించి తినాలి. ఇక రాత్రంతా వీటిని నానబెట్టి మరుసటి రోజు ప్రెషర్ కుక్కర్‌లో వేసి ఉడికిస్తే ఇంకా మంచిది. దీంతో పప్పు దినుసులు త్వరగా ఉడకడమే కాదు.. వాటిని తింటే సులభంగా జీర్ణం అవుతాయి కూడా. దీంతో పప్పు దినుసుల్లో ఉండే పోషకాలన్నింటినీ పొందవచ్చు. ఇలా పప్పు దినుసులను ఉడికించి తినాల్సి ఉంటుంది.