Noodles Samosa : మనం సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తీసుకునే వాటిలో సమోసాలు కూడా ఒకటి. సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మనం ఎక్కువగా ఆలూ సమోసా, పనీర్ సమోసా, పోహ సమోసా, ఆనియన్ సమోసా వంటి వాటిని మాత్రమే తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా మరింత మనం నూడుల్స్ తో కూడా సమోసాలను తయారు చేసుకోవచ్చు. నూడుల్స్ తో చేసే ఈ సమోసాలు క్రిస్పీగా చాలారుచిగా ఉంటాయి. వీటిని కూడా అందరూ ఇష్టపడతారని చెప్పవచ్చు. ఈ నూడుల్స్ సమోసాలను తయారు చేయడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులను కోరుకునే వారు ఇలా నూడుల్స్ సమోసాలతో తయారు చేసుకుని తినవచ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే నూడుల్స్ సమోసా తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
నూడుల్స్ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, వాము – పావు టీ స్పూన్, వేడి నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నూడుల్స్ – 100 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, క్యాప్సికం తరుగు – 2 టేబుల్ స్పూన్స్, క్యాబేజి తరుగు – అర కప్పు, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, పంచదార – చిటికెడు.
నూడుల్స్ సమోసా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో వాము, నెయ్యి, ఉప్పు వేసికలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని వీలైనంత గట్టిగా కలుపుకోవాలి. తరువాత దీనిపై తడి వస్త్రాన్ని కప్పి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక నూడుల్స్ వేసి 90 శాతం ఉడికించాలి. నూడుల్స్ ఉడికిన తరువాత వాటిని వడకట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిపై కొద్దిగా నూనె వేసి టాసింగ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం తరుగు, క్యాబేజి తరుగు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, పంచదార వేసి కలపాలి. తరువాత ఉడికించిన నూడుల్స్ వేసి కలపాలి. వీటిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ముందుగా కలిపిన పిండిని ఉండలుగా చేసుకోవాలి.
తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ పొడుగ్గా చపాతీలా వత్తుకోవాలి. తరువాత చపాతీని మధ్యలోకి కట్ చేసి ఒక భాగాన్ని చేతులోకి తీసుకోవాలి. ఇప్పుడు అంచులకు నీటితో తడి చేసి సమోసా ఆకారంలో వత్తుకోవాలి. తరువాత మధ్యలో మూడు టీ స్పూన్ల నూడుల్స్ మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసి వేయాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సమోసాలను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సమోసాలు కాలి పైకి తేలిన తరువాత స్టవ్ ఆన్ చేసి మంటను చిన్నగా చేయాలి. ఈ సమోసాలను చిన్న మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నూడుల్స్ సమోసా తయారవుతుంది. వీటిని టమాట సాస్, షెజ్వాన్ సాస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేరకం సమోసాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇలా తయారు చేసిన సమోసాలను ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు.