Nuvvula Avakaya : నువ్వుల ఆవ‌కాయ‌ను ఇలా ఎప్పుడైనా పెట్టారా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Nuvvula Avakaya : ఆవకాయ.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేస‌వి రాగానే సంవ‌త్స‌రానికి స‌రిప‌డా ఆవ‌కాయను త‌యారు చేసుకుని నిల్వ చేస్తూ ఉంటారు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ ఆవ‌కాయ‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో నువ్వుల ఆవ‌కాయ కూడా ఒక‌టి. నువ్వుల పొడి వేసి చేసే ఈ ఆవ‌కాయ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టి సారి చేసే వారు కూడా ఈ ఆవ‌కాయ‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌టి వాస‌న వ‌చ్చేలా నువ్వుల ఆవ‌కాయ‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల ఆవ‌కాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మామిడికాయ ముక్క‌లు – మూడు క‌ప్పులు, నువ్వుల పొడి – పావు కిలో, ఆవ పొడి – 150 గ్రా., ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – 150 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టేబుల్ స్పూన్, మెంతుల పొడి – అర టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – అర కిలో.

Nuvvula Avakaya recipe in telugu very tasty
Nuvvula Avakaya

నువ్వుల ఆవ‌కాయ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు వేసి వేయించాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె చ‌ల్లారిన త‌రువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక గిన్నెలో నువ్వుల పొడి, ఆవ పొడి, జీల‌క‌ర్ర పొడి, మెంతుల పొడి, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత చ‌ల్లారిన నూనె కూడా వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత మామిడికాయ ముక్క‌లు వేసి చేత్తో బాగా క‌ల‌పాలి. ఈ ప‌చ్చ‌డిని మూడు రోజుల పాటు ఊర‌బెట్టిన త‌రువాత మ‌రోసారి అంతా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల ఆవ‌కాయ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన ఆవ‌కాయ కూడా చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.

D

Recent Posts