Beerakaya Masala Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయ మన ఆరోగ్యానిక ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ తో మన శరీరానికి అసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. మలబద్దకం సమస్యో బాధపడే వారు బీరకాయను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బీరకాయతో మనం కూరలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బీరకాయతో ఎంతో రుచిగా ఉండే బీరకాయ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీరకాయలు – అరకిలో, తరిగిన ఉల్లిపాయలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన టమాట – 1, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె -2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – రెండు రెమ్మలు, పసుపు – పావు టీ స్పూన్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – అర కప్పు, కొబ్బరి తురుము – పావు కప్పు, సోంపు గింజలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, యాలకులు – 4, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, జీడిపప్పు – 6, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 5 లేదా తగినన్ని.
బీరకాయ మసాలా కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిపైమూత పెట్టి 6 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి బీరకాయ ముక్కలను మెత్తగా ఉడికించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా వేసి కలపాలి. దీనిని కూర దగ్గర పడి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీరకాయతో ఈ విధంగా చేసిన కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కూరను తినడం వల్ల రుచితో పాటు బీరకాయ వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.