Nuvvula Pachadi : రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ఆరోగ్యాన్ని అందించే.. నువ్వుల ప‌చ్చ‌డి.. ఇలా చేయాలి..!

 Nuvvula Pachadi : తెలుగువారిలో చాలా మందికి భోజ‌నంలో కూరతో పాటు ఫ్రై, ప‌చ్చ‌డి, ఆవ‌కాయ ఇలా ఏదో ఒక‌టి ఉండాల్సిందే. నిల్వ ఉండే ప‌చ్చ‌ల్లు రోజూ తిన‌డం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ ఒక‌టి లేదా రెండు రోజులు ఉండే విధంగా మ‌నం త‌యారు చేసుకునే కొన్ని ప‌చ్చ‌ల్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని పోష‌కాహార నిపుణులు అంటున్నారు. వీటితో మ‌న శ‌రీరానికి అందాల్సిన పోష‌కాలు అన్నీ అంద‌డ‌మే కాకుండా రుచిగా ఉంటాయి.

అంతే కాకుండా ఈ ప‌చ్చ‌ల్ల‌లో వాడే వివిధ ర‌కాల‌ ప‌ప్పు దినుసులు, ఆకు కూర‌లు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి దోహ‌ద‌ప‌డుతాయి. అలాగే నువ్వులు కూడా మ‌న‌కు అవ‌స‌ర‌మైన ప్రొటీన్, ఫైబ‌ర్, కార్బోహైడ్రేట్లను అందించ‌డంతో పాటు ఎముక‌ల‌కు, గుండెకు మేలు చేయ‌డానికి, శ్వాస స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతాయి. ఇలాగే ఆరోగ్యానికి మేలుచేసే నువ్వుల ప‌చ్చ‌డిని ఎలా త‌యారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల ప‌చ్చ‌డి త‌యారు చేయ‌డానికి కావాల్సిన ప‌దార్థాలు..

నువ్వులు- 2 క‌ప్పులు, ప‌చ్చిమిర్చి- 6, ధ‌నియాలు- అర స్పూన్, మెంతులు- పావు స్పూన్, ఉప్పు- త‌గినంత‌, ప‌సుపు- చిటికెడు,చింత‌పండు- కొద్దిగా,బెల్లం- కొద్దిగా, నూనె- 2 స్పూన్లు, ఆవాలు- అర స్పూన్,ఎండుమిర్చి- 1, క‌రివేపాకులు- 4, జీల‌క‌ర్ర‌- పావు స్పూన్, ఇంగువ‌- పావు స్పూన్.

 Nuvvula Pachadi gives immunity and health recipe
Nuvvula Pachadi

నువ్వుల ప‌చ్చ‌డిని త‌యారు చేసే విధానం..

ముందుగా స్ట‌వ్ పై ఒక బాణ‌లిలో నువ్వులను దోర‌గా వేయించాలి. త‌రువాత ధ‌నియాలు, మెంతుల‌ను కూడా వేయించి ప‌క్క‌న పెట్టాలి. చింత‌పండును నీటిలో నాన‌బెట్టుకోవాలి. నువ్వుల‌ను మిక్సీలో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి. త‌రువాత అందులో ధ‌నియాలు, మెంతులు వేసి పొడి చేయాలి. త‌రువాత అందులో నాన‌బెట్టిన చింత‌పండు, ప‌చ్చిమిర్చి, ప‌సుపు, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. తియ్య‌గా కావాలి అనుకున్న‌వారు కొద్దిగా బెల్లం వేసుకోవ‌చ్చు. ఇప్పుడు స్ట‌వ్ పై బాణ‌లి పెట్టి అందులో నూనె వేయాలి. అది వేడెక్కాక దానిలో ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకులు, ఇంగువ, ఎండుమిర్చి వేసి పోపు పెట్టి ప‌చ్చ‌డిపై వేయాలి. ఘుమ‌ఘుమ‌లాడుతూ నువ్వుల ప‌చ్చ‌డి రెడీ అవుతుంది.

Share
Prathap

Recent Posts