Bangaru Teega Chepa Fry : మాంసాహార ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చేపల ఫ్రై కూడా ఒకటి. చేపల ఫ్రై అనగానే చాలా మంది నోట్లో నీళ్లూరుతుంటాయి. చేపల ఫ్రై రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయడానికి నూనె ఎక్కువగా అవసరమవుతుంది. దీని వల్ల చేప ఫ్రై కూడా అనారోగ్యంగా మారుతుంది. అస్సలు ఒక చుక్క నూనె ఉపయోగించకుండా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా మనం ఈ చేపల ఫ్రై ను తయారు చేసుకోవచ్చు. నూనె లేకుండా బంగారు తీగ చేపలతో ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారు తీగ చేపలతో ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగారు తీగ చేపలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), చిన్న ఉల్లిపాయలు – 10, వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం – 2 ఇంచుల ముక్క, పచ్చిమిర్చి – 5 లేదా 6, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కాశ్మీరీ కారం – 2 టీ స్పూన్స్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, లేత అరటి ఆకులు – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర – కొద్దిగా.
బంగారు తీగ చేపల ఫ్రై తయారీ విధానం..
ముందుగా చేపలను శుభ్రంగా కడగాలి. తరువాత ఆ చేపలను శుభ్రపరిచి వాటికి గాట్లు పెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో ఉల్లిపాయలను, అల్లాన్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇందులోనే వెల్లు్ల్లి రెబ్బలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న చేపలకు బాగా పట్టించాలి. వీటిని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి.
ఇప్పుడు అరటి ఆకులను తీసుకుని వాటిలో చేపలను ఉంచాలి. వీటిపై మిగిలిన మసాలాను, కరివేపాకును, కొత్తిమీరను చల్లి మూటలా కట్టుకోవాలి. మూట ఊడిపోకుండా దానిని కాటన్ దారంతో లేదా అరటి ఆకుతో నారతో కట్టాలి. వీటిని అడుగు భాగం మందంగా ఉండే కళాయిలో లేదా గిన్నెలో ఉంచాలి. తరువాత వీటిపై ఆవిరి బయటకు పోకుండా మూతను ఉంచాలి. వీటిని మొదటి 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత మంటను చిన్నగా చేసి 10 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు చేపను మరో వైపుకు తిప్పి మరో 15 నిమిషాల పాటు వేయించాలి. చేప ఉడకడం అనేది అరటి ఆకు మందం, చేప పరిమాణంపై ఆధశారపడి ఉంటుంది.
అరటి మందంగా లేదా చేప పెద్దగా ఉంటే మరికొద్ది సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని బయటక తీసి మూట విప్పి నెమ్మదిగా ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బంగారు తీగ చేపల ఫ్రై తయారవుతుంది. దీనిని నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తినవచ్చు. నూనె తక్కువగా తినేవారు, వ్యాయామాలు చేసే వారు, డైటింగ్ చేసే వారు ఇలా అరటి ఆకుల్లో చేపల ఫ్రైను తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.