Oats Paratha : మన ఆరోగ్యానికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఓట్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఓట్స్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఓట్స్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఓట్స్ పరాటాలు కూడా ఒకటి. ఓట్స్ తో చేసే పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణ సమస్యలు ఉన్న వారు పరాటాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
ప్లేన్ ఓట్స్ – ఒక కప్పు, గోధుమపిండి – 4 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన టమాట – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ -1, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, బీట్ రూట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, కీరదోస తురుము – 2 టేబుల్ స్పూన్స్.
ఓట్స్ పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఓట్స్ ను వేసి పచ్చిదనం పోయే వరకు వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత గోధుమపిండితో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. తరువాత పిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ గోధుమపిండి చల్లుకుంటూ పరాటాలా వత్తుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పరాటాను వేసి కాల్చుకోవాలి. దీనిని నేరుగా ఇలాగే కాల్చుకోవచ్చు. లేదంటే కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి కాల్చుకోవచ్చు. ఈ పరాటాను రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ పరాటాలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.