Ravva Biscuits : ఓవెన్ లేకుండా ర‌వ్వ‌తో ఇలా బిస్కెట్ల‌ను చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి..!

Ravva Biscuits : ర‌వ్వ‌తో మ‌నం ఉప్మానే కాకుండా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో బిస్కెట్లు కూడా ఒక‌టి. ర‌వ్వ‌తో బిస్కెట్లు ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా… అవును మ‌నం ర‌వ్వ‌తో రుచిక‌ర‌మైన బిస్కెట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే ఒవెన్ లేక‌పోయినా స‌రే మ‌నం రుచిక‌ర‌మైన బిస్కెట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వతో రుచిక‌ర‌మైన బిస్కెట్లను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌వ్వ బిస్కెట్ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొంబాయి ర‌వ్వ – అర క‌ప్పు, మైదాపిండి – అర క‌ప్పు, శ‌న‌గ‌పిండి – అర క‌ప్పు, బేకింగ్ పౌడ‌ర్ – అర టీ స్పూన్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – అర క‌ప్పు, పంచ‌దార పొడి – ముప్పావు క‌ప్పు.

Ravva Biscuits recipe in telugu very tasty make them like this
Ravva Biscuits

ర‌వ్వ బిస్కెట్ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ర‌వ్వ‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో శ‌న‌గ‌పిండి, మైదాపిండి, బేకింగ్ పౌడ‌ర్, యాల‌కుల పొడి వేసి అన్ని కలిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత మ‌రో గిన్నెలో నెయ్యి, పంచ‌దార పొడి వేసి క‌ల‌పాలి. దీనిని ఒకే దిశ‌లో 5 నిమిషాల పాటు క‌లిపిన త‌రువాత ర‌వ్వ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ క‌లుపుకోవాలి. అవ‌స‌ర‌మైతే మ‌రో టీ స్పూన్ నెయ్యి వేసి క‌లుపుకోవాలి. ఈ ర‌వ్వ మిశ్ర‌మం చ‌పాతీ పిండికంటే గ‌ట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండే గిన్నెలో ఇసుక లేదా ఉప్పు వేసి అందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి ప‌ది నిమిషాల పాటు వేడి చేయాలి. ఇసుక వేడ‌వుతుండ‌గానే ప్లేట్ కు నెయ్యి రాసి తీసుకోవాలి. ఇప్పుడు ర‌వ్వ మిశ్ర‌మాన్ని చిన్న నిమ్మ‌కాయంత ప‌రిమాణంలో తీసుకుని మొద‌ట గుండ్రంగా చేయాలి.

త‌రువాత రెండు చేతుల‌తో కొద్దిగా వ‌త్తుకుని పైన బాదంప‌ప్పుతో గార్నిష్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్ ప‌రిమాణానికి త‌గిన‌ట్టు త‌గిన‌న్ని బిస్కెట్ల‌ను తీసుకోవాలి. అలాగే బిస్కెట్లు దూరం దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ ను స్టాండ్ పై ఉంచి మూత పెట్టి చిన్న మంట‌పై 35 నుండి 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. 35 నిమిషాల త‌రువాత మూత తీసి బిస్కెట్లు త‌యార‌య్యాయో లేదో చూసుకోవాలి. లేదంటే మ‌రో 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. బిస్కెట్లు బేక్ అయిన త‌రువాత ప్లేట్ ను బ‌య‌ట‌కు తీసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత నెమ్మ‌దిగా బిస్కెట్ల‌ను ప్లేట్ నుండి వేరు చేసివేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ బిస్కెట్లు త‌యార‌వుతాయి. వీటిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే ర‌వ్వ‌తో రుచిక‌ర‌మైన మృదువైన బిస్కెట్ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts