Onion Ka Salan : బిర్యానీ, పులావ్ వంటి వాటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. బిర్యానీ, పులావ్ వంటివి తినడానికి రుచిగా ఉన్నప్పటికీ వీటిని ఆనియన్ కా సాలన్ వంటి కూరలతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. హోటల్స్ లో బిర్యానీతోపాటు మనకు ఈ కూరలను కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఆనియన్ కా సాలన్ కూరను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బిర్యానీలోకి తినే ఆనియన్ కా సాలన్ ను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ కా సాలన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – ఒక రెబ్బ, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్, బెల్లం తురుము – పావు టీ స్పూన్, నీళ్లు – ముప్పావు కప్పు, కసూరి మెంతి – ఒక టీ స్పూన్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, గసగసాలు – 2 టీ స్పూన్స్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, చింతపండు – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు.
ఆనియన్ కా సాలన్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పేస్ట్ ను తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని ముందుగా మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలపాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను వేసి కలపాలి. తరువాత కళాయిపై మూతను ఉంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత నీళ్లు, బెల్లం తురుము వేసి కలిపి మరలా నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కసూరి మెంతిని, కొన్ని వేయించిన ఉల్లిపాయ ముక్కలను వేసి కలిపి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చక్కటి రుచిని కలిగి ఉండే ఆనియన్ కా సాలన్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన ఆనియన్ కా సాలన్ ను బిర్యానీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే బిర్యానీ రుచి మరింత పెరుగుతుంది.