Onions Tears : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాగే మనం చేసే ప్రతి వంటల్లోనూ ఉల్లిపాయను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కూరల్లో ఉల్లిపాయను వేస్తే ఎంత రుచి వస్తుందో దాని తరిగేటప్పుడు మాత్రం అంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ తరిగిటేప్పుడు కళ్లు మండి నీరు కారుతూ ఉంటుంది. వీటిని తరిగేటప్పుడు జరిగే రసాయన చర్యల కారణంగా విడుదలయ్యే సల్ఫర్ డై యాక్సైడ్ కారణంగా కంటి నుండి నీరు వస్తుంది. ఉల్లిపాయలను కోసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోవడం వల్ల కంటి నుండి నీరు రాకుండా చూసుకోవచ్చు.
లావుగా పదును లేకుండా ఉన్న కత్తితో కోస్తే ఉల్లిపాయల నుండి సల్ఫర్ డై యాక్సైడ్ ఎక్కువగా విడుదల అవుతుంది. దాంతో కళ్లు మండడంతోపాటు కళ్ల నుండి నీరు కూడా విడుదల అవుతుంది. కనుక పలుచగా, పదునుగా ఉన్న కత్తిని ఉపయోగించాలి. దీని వల్ల ఉల్లిపాయ నుండి విడుదలయ్యే రసాయనాల మోతాదు తగ్గడం వల్ల కళ్లు అంతగా మండవు. అలాగే మనం ఉల్లిపాయలను కోసి నీటిలో వేస్తుంటాం. వీటిని ముందుగా సగానికి కోసి నీటిలో వేసి తరువాత చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముందుగా సగానికి కోసి నీటిలో వేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
గాలి బాగా ప్రసరించే చోట మాత్రమే ఉల్లిపాయలను కోయాలి. అలా అని ఫ్యాన్ కింద కూర్చుని కోయడం కూడా అంత మంచిది కాదు. అలాగే ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎగ్జాటిక్ ఫ్యాన్ కింద కూర్చొని చూస్తే కళ్లు అంత ఎక్కువగా మండకుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయలను కోసే ముందు కొద్దిసేపు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా కంటి నుండి నీరు రాకుండా చూసుకోవచ్చు. ఇలా ఫ్రిజ్ లో ఉంచడం వల్ల ద్రవరూపంలో ఉన్న రసాయనాలు గడ్డకడతాయి. దీంతో వాటిని కోసినప్పుడు అవి తక్కువగా విడుదల అవుతాయి.
సగానికి తరిగిన ఉల్లిపాయను చాపింగ్ బోర్డ్ మీద బోర్లించి ఉంచాలి. ఇలా చేయడం వల్ల రసాయనాలు తక్కువగా విడుదల అయ్యి కళ్ల నుండి నీరు కారకుండా ఉంటాయి. చాలా మంది ఉల్లిపాయలను కోసిన వెంటనే గిన్నెలో వేస్తుంటారు. దీని వల్ల మరింతగా రసాయనాలు విడుదల అవుతాయి. కాబట్టి చాపింగ్ బోర్డ్ మీద కోసినవి కోసినట్టుగా ఉంచి తరువాత గిన్నెలో వేయాలి.
అదే విధంగా ఉల్లిపాయలను కోసే ప్రదేశంలో ఒక కొవ్వొత్తిని ఉంచడం వల్ల కూడా కళ్లు మండకుండా కళ్ల నుండి నీరు కారకుండా ఉంటుంది. అలాగే మండుతున్న గ్యాస్ స్టవ్ కు దగ్గరలో ఉల్లిపాయలను కోసినా కూడా కళ్లు మండకుండా ఉంటాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఉల్లిపాయలను కోసేటప్పుడు కళ్లు మండకుండా చూసుకోవచ్చు.