Onion Pakoda : మనకు సాయంత్రం సమయంలో హోటల్స్ లో అలాగే బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో పకోడీలు కూడా ఒకటి. పకోడీలను రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఉల్లిపాయలతో చేసే ఈ పకోడీలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఈ ఉల్లిపాయ పకోడీలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా వీటిని తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఉల్లిపాయ పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 4, శనగపిండి – 100 గ్రా., బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 4, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆనియన్ పకోడా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. తరువాత ఇందులో జీలకర్ర, ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలను నలుపుతూ బాగా కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత శనగపిండి, బియ్యం పిండి వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పకోడీల్లా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించి పకోడీలపై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పకోడీలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా ఉల్లిపాయ పకోడీలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ పకోడీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.