Onion Vada : ఉల్లిపాయ.. ఇది లేని వంటగది లేదనే చెప్పవచ్చు. ఉల్లిపాయను ఎంతోకాలంగా వంటల్లో ఉపయోగిస్తూ ఉన్నాం. వంటల రుచిని పెంచడంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉల్లిపాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వంటల్లో ఉపయోగించడంతో పాటు ఉల్లిపాయలతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఉల్లిపాయలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఉల్లిపాయ వడ కూడా ఒకటి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని చాలా తక్కువ సమయంలో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2 ( పెద్దవి), బంగాళాదుంప – 1, పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, కారం – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, బియ్యం పిండి – అర కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ముందుగా బంగాళాదుంపను పొట్టు తీసి తురుముకోవాలి. తరువాత ఈ తురుమును నీటిలో వేసి బాగా కడగాలి. తరువాత ఈ తురుమును నీళ్లు పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమాన్ని తీసుకుంటూ చేతికి నూనె రాసుకుంటూ వడల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినన్ని వడలను వేసుకుని కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఉల్లిపాయలతో పకోడీలను కాకుండా అప్పుడప్పుడూ ఇలా వడలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. వీటిని విడిచి పెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.